వ్యాక్సినేషన్​పై మీ విధానమేంటి?

వ్యాక్సినేషన్​పై మీ విధానమేంటి?
  • కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • 45 ఏండ్లపైన ఉన్నోళ్ల కోసమే మీరు వ్యాక్సిన్లు కొంటరా?.. ఆ లోపు వాళ్ల కోసమైతే రాష్ట్రాలకు వదిలేస్తరా?
  • టీకా ధరల్లో తేడాలెందుకు? కేంద్రమే నిర్ణయించొచ్చు కదా..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్​ విధానాలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా టీకాల కొరత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు, ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్లపై వెల్లువెత్తిన విమర్శలను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. అసలు ఏ లెక్కన వ్యాక్సిన్​ విధానాన్ని అమలు చేస్తున్నారో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్​ ఎల్​ఎన్​ రావు, జస్టిస్​ ఎస్​. రవీంద్రల బెంచ్​ నిలదీసింది. ప్రభుత్వం ఏం చెప్పినా చెల్లుతుందనుకోవడం కరెక్ట్​ కాదని, కోర్టులు ఎత్తిచూపిన లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది.

సెకండ్​వేవ్​లో 45 ఏళ్ల లోపు వాళ్లకే ముప్పు
‘‘45 ఏళ్లు దాటినోళ్లందరి కోసం మొత్తం వ్యాక్సిన్లను కొంటున్నారు. కానీ, 18–44 ఏళ్ల వారి కోసం మాత్రం రాష్ట్రాలే సగం కొనుక్కోవాలని చెప్తున్నారు. మిగతా వ్యాక్సిన్లను ప్రైవేట్​కు ఇచ్చేస్తున్నారు. అందులోనూ వేర్వేరు ధరలను నిర్ణయించారు. కేంద్రానికి రూ.150 అయితే.. రాష్ట్రాలకు మాత్రం దాని కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ధరలను నిర్ణయించే అధికారం కంపెనీలకే ఇచ్చారు. మెడికల్​ అండ్​ కాస్మెటిక్స్​ యాక్ట్​ ప్రకారం దేశం మొత్తానికి ఒకే ధరను కేంద్రమే నిర్ణయించొచ్చు కదా. అసలు ఏ పద్ధతిన మీరు వ్యాక్సిన్​ విధానాన్ని రూపొందించారు?’’ అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. సెకండ్​ వేవ్​లో 45 ఏండ్ల లోపు వాళ్లే ఎక్కువగా మహమ్మారి బారిన పడ్డారని బెంచ్​ గుర్తు చేసింది.

ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్లతో పల్లె జనానికి నష్టం
వ్యాక్సిన్ల కోసం ‘కొవిన్​’లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలనడం జనాల మధ్య గీత గీయడమేనని సుప్రీం కోర్టు మండిపడింది.  దేశంలో డిజిటల్​ లిటరసీ అతిపెద్ద సమస్య అని చెప్పింది. ఇంటర్నెట్​ సక్కగ రాని పల్లెల్లో ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ వల్ల వ్యాక్సినేషన్​కు అడ్డంకులు ఏర్పడతాయని పేర్కొంది. అయితే, దగ్గర్లోని ఇంటర్నెట్​ సెంటర్​కు వెళ్లి ఊరి వాళ్లు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చన్న కేంద్రం వివరణను కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఈ ఏడాది చివరికి అర్హులందరికీ కరోనా టీకాలు వేస్తామని కేంద్రం చెప్పడంతో.. నెలకు 15 కోట్ల డోసులే వస్తే, ఆరు నెలల్లో ఎలా టార్గెట్​ను చేరుకుంటారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

దేశం మొత్తాన్ని పాలించట్లేదా?
గ్లోబల్​ టెండర్ల మీదా కేంద్రాన్ని సుప్రీం నిలదీసింది. అయితే, అది అకడమిక్​ వ్యవహారమని కేంద్రం చెప్పేందుకు ప్రయత్నించినా.. అది అకడమిక్​ ఇష్యూ కాదంది. ముంబై టెండర్లు పిలిస్తే స్పుత్ని క్​ తయారీ కంపెనీ బిడ్లు దాఖలు చేసిం దని, ఢిల్లీ, పంజాబ్​ రాష్ట్రాలు ఫైజర్​, మోడర్నాల నుంచి బిడ్లను పిలిచినా కంపెనీలు ఒప్పుకోలేదని గుర్తుచేసింది. టీకాల కొనుగోళ్లను రాష్ట్రాలకు వదిలే స్తారా, దేశం మొత్తాన్ని కేంద్రం పాలిం చట్లేదా? అని ప్రశ్నించింది. వ్యాక్సిన్​ దిగుమతి అంశా న్ని రాష్ట్రాలకు వదిలే యడం కరెక్ట్​ కాదని తేల్చి చెప్పింది.