
హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు 50 కోట్ల రూపాయల విలువైన పంచదార నీళ్ల పాలైంది. హర్యానాలోని యమునా నగర్లో ఉన్న సరస్వతి షుగర్ మిల్ ఆసియాలోనే అతి పెద్దది. హర్యానాలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఈ షుగర్ మిల్ను ముంచెత్తింది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న పంచదార బస్తాలు నీళ్లలో నానిపోయాయి. ఆ వరద నీళ్లలో పంచదార కరిగిపోయి కనిపించింది.
యమునా నగర్ గిడ్డంగిలో 2 లక్షల 20 వేల క్వింటాళ్ల పంచదార స్టోర్ చేసి ఉంది. ఈ పంచదార విలువ సుమారు 97 కోట్లు. వరదల కారణంగా సుమారు 40 శాతం పంచదార గంగపాలైంది. 50 నుంచి 60 కోట్ల మేర నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వరద నీటితో పాటు సమీపంలోని డ్రైన్ పొంగి పొర్లడంతో వరద నీళ్లు షుగర్ మిల్లోకి ఉప్పెనలా వచ్చాయని, పంచదార బస్తాలను ముంచెత్తాయని అధికారులు తెలిపారు.
సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా ఈ ఘటనపై స్పందిస్తూ.. మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ వాటర్ గిడ్డంగి కుడి వైపు నుంచి పోతుంటాయని, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయి ఆ నీళ్లంతా వరద నీళ్లతో కలిసి షుగర్ మిల్ను, గిడ్డంగిని ముంచెత్తాయని చెప్పారు. సోమవారం రాత్రి హర్యానాలో కుండపోత వర్షం కురిసింది. వరద నీళ్లు ముంచెత్తాయి. ఎంత భారీ వర్షాలు కురిసినా, వరదలు పోటెత్తినా ఈ షుగర్ మిల్లోకి ఎప్పుడూ నీళ్లు పోయినా సందర్భాలు లేవని, ఫస్ట్ టైం ఇలా జరిగిందని రాజీవ్ మిశ్రా చెప్పారు. షుగర్ మిల్, గిడ్డంగిలో ఉన్న నీళ్లను అధికారులు భారీ మోటార్ల సాయంతో బయటకు తోడిపోయిస్తున్నారు.
हरियाणा के यमुनानगर स्थित एशिया की सबसे बड़ी शुगर मिल में भरा पानी, ₹50 करोड़ की चीनी बर्बाद। #Haryana #HeavyRainfall #HeavyRain #Monsoon2025 #ViralVideo #Trending #Sugarmill #MatrizeNews pic.twitter.com/0hlBGhtOZY
— Matrize News Communications Pvt. Ltd (@Matrize_NC) July 1, 2025
ఉత్తర భారతంలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్కు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. జులై 2 నుంచి 5 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాలతో జార్ఖండ్ ఆగమాగం అవుతోంది. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.