
2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణాల్లో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఒకటి అని నిస్సందేహంగా చెప్పచ్చు. 3 వేల 648 కిలోమీటర్ల మేర 341 రోజులు జరిగిన ఈ పాదయాత్ర ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఈ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ కానుందని తెలుస్తోంది. 2029 ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు జగన్. మంగళవారం ( జులై 1 ) తాడేపల్లిలో వైసీపీ యూత్ వింగ్ తో భేటీ అయినా జగన్ ఈమేరకు సంచలన నిర్ణయం ప్రకటించారు.
ALSO READ | 2027లోనే జమిలీ ఎన్నికలు.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
యూత్ వింగ్ పార్టీలో క్రియాశీలకమైందని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని అన్నారు జగన్. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని.. లీడర్లుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గొప్ప అవకాశం ఉంటుందని అన్నారు జగన్. వచ్చే ఎన్నికలకు ముందు ఎలాగో తన పాదయాత్ర ఉంటుందని.. అప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రతి ఒక్కరిని పేరుపేరునా పిలిచి కలుస్తానని అన్నారు జగన్. పార్టీ పెట్టిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే అని.. అప్పట్లో పార్టీలో తాను, తన తల్లి మాత్రమే ఉన్నారని, తన మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు పార్టీలోకి వచ్చారని అన్నారు జగన్.
పార్టీ పెట్టడంతోనే తన ప్రస్థానం మొదలైందని.. ఎన్ని కష్టాలు వచ్చినా.. విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట వేశానని అన్నారు జగన్. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదని.. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ తనకు వచ్చిందని అన్నారు. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ తనవైపు చూసే పరిస్థితి ఉండేదని.. దాన్ని జీర్ణించుకోలేక తనమీద పగబట్టారని అన్నారు జగన్. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే వాళ్లందరిచేతా రాజీనామా చేయించానని.. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించామని అన్నారు. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసి పోటీచేశాయని గుర్తు చేశారు జగన్.
2014లో 67 మందితో గెలిచామని.. గెలిచిన 67 మందిలో 23 మందిని చంద్రబాబు లాక్కున్నారని అన్నారు. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం 2019 ఎన్నికల్లో వాళ్ళు లాక్కున్న 23 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు జగన్. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమని.. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని.. మంచి పలకరింపు అన్నదికూడా చాలా ముఖ్యమని.. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారని అన్నారు జగన్.
మళ్ళీ పాదయాత్ర ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. జగన్ 2.0 లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరి, 2019 ఎన్నికల్లో సంచలనాలకు నాంది పలికిన జగన్ పాదయాత్ర 2029 ఎన్నికల్లో ఏమేరక ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి.