
న్యూఢిల్లీ: రాష్ట్రాలతో చర్చించి మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు నెలసరి సెలవుపై ఒక పాలసీని తయారు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. తామిచ్చే ఆదే శాలతో.. మేనేజ్మెంట్లు మహిళలను ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంలో పునరాలోచించే అవకాశం ఉందని.. ఇది కేంద్ర, రాష్ట్రాలు పాలసీ తయారు చేయాల్సిన అంశం కనుక వారే ఒక సమగ్ర విధానం రూపొందించాలని పేర్కొంది. మెన్ స్ట్రువల్ సెలవులు అమలు చేసేలా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ లాయర్శైలేంద్ర త్రిపాఠి సుప్రీంకోర్టులో పిల్దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం పిల్‌పై విచారణ చేపట్టింది. ‘‘మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు ఇలాంటి సెలవులు తప్పనిసరిగా మంజూరు చేయాలని మేం నిర్ణయిస్తే.. అది ప్రతికూలంగా మారవచ్చు. ఇకపై మేనేజ్మెంట్లు వారిని ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఆసక్తి చూపకపోవచ్చు. అది మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది. మేం మహిళల ప్ర యోజనాలు రక్షించేలా వ్యవహరిస్తం. వాస్తవానికి ఇది కేంద్రం, రాష్ట్రాల పాలసీ రూపొందించాల్సిన అంశం. వారే దీనిపై ఒక మోడల్ పాలసీని రూపొందించాలి. కోర్టులు ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు” అని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అలాగే ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రాలను సంప్రదించి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ మోడల్ పాలసీ నిర్ణయం తీసుకోవాలని కోరింది. సెక్రటరీని కలిసి విషయంలో పిటిషనర్ కు సహకరించాలని అడిషన్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సూచించింది. అలాగే ఫిబ్రవరిలో దాఖలైన ఇదే తరహా పిటిషన్ విషయంలోనూ ఇలాంటి వైఖరినే తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది.