
- ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
- ఈ నెల 9లోగా సమర్పించాలని డెడ్‌లైన్
న్యూఢిల్లీ / ముంబై: బిహార్‌లో ఓటర్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీ)ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆగస్టు 9 లోగా వివరాలు వెల్లడించాలని డెడ్‌లైన్ పెట్టింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) జరిపిన ఎన్నికల కమిషన్.. ఇటీవలే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది.
గతంలో ఉన్న జాబితాలోంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని చెప్పింది. దీంతో ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్జీవోతోపాటు పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్‌భుయాన్, కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ బుధవారం విచారణ జరిపింది.
తొలగించిన 65 లక్షల మంది ఓటర్లు ఎవరు? వాళ్లంతా మరణించారా లేదా వలస వెళ్లారా అని ఈసీని ప్రశ్నించింది. వచ్చే శనివారంలోగా దీనికి సమాధానం చెప్పాలంది. ఓటర్ల ముసాయిదా లిస్ట్‌ను పొలిటీషియన్లకు ఇచ్చినట్టుగానే ఎన్జీవోకు కూడా అందజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఎన్జీవో తరఫు లాయర్ వాదిస్తూ, రాజకీయ నాయకులు జాబితాను ఈసీ ఇచ్చిందిగానీ, అంతమందిని లిస్ట్‌లోంచి ఎందుకు తొలగించారో పేర్కొనలేదని వివరించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల సిఫార్సు లేకుండానే చాలా కొత్త పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఎన్నికల అధికారులు చేర్చారని లాయర్ ఆరోపించారు.
మాజీ పొలిటీషియన్ జడ్జి అయితే న్యాయాన్ని ఎట్ల ఆశిస్తం?
బాంబే హైకోర్టు జడ్జి పదవికి బీజేపీ మాజీ స్పోక్స్‌పర్సన్ అయిన ఆర్తి అరుణ్ సాథేను సిఫార్సు చేయడంపై మహారాష్ట్రలో రాజకీయ వివాదం తలెత్తింది. ఈ నియామకంపై ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్తి సాథే 2023 నుంచి 2024 వరకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధిగా పనిచేశారని, ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించడం న్యాయవ్యవస్థ నిష్పక్షపాతాన్ని ప్రశ్నార్థకం చేస్తుందన్నారు.
"బీజేపీని ప్రజా వేదికలపై సమర్థించిన వ్యక్తిని హైకోర్టు జడ్జిగా నియమించడం ప్రజాస్వామ్యానికి దెబ్బ. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన కేసుల్లో ప్రజలు న్యాయం ఆశించవచ్చా ? అందుకే సుప్రీంకోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలి" అని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, శివసేన కూడా ఈ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.