రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివి .. వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివ్వరు: సుప్రీంకోర్టు

రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివి .. వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివ్వరు: సుప్రీంకోర్టు
  • కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నయ్ 
  • మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని వ్యాఖ్య

న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాగా మారాయని వ్యాఖ్యానించింది. వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివ్వరని పేర్కొంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్లు చేసింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన డివిజన్ బెంచ్  మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ... ఓబీసీలు రాజకీయంగా వెనుకబడిన వారో కాదో గుర్తించకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు స్థానిక సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. 

దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘మన దేశంలో రిజర్వేషన్లు రైలు బోగీల్లాగా మారాయి. వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులెవరూ అందులోకి రావాలని అనుకోరు. ఇదే అసలైన ఆట. ఇప్పుడు పిటిషనర్ ఉద్దేశం కూడా అదే” అని అన్నారు. మళ్లీ శంకరనారాయణన్ వాదిస్తూ.. రిజర్వేషన్ల అమలు కోసం ఓబీసీల్లో రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

 సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వాళ్లు ఎందుకు ప్రయోజనం (రిజర్వేషన్లు) పొందకూడదు? కొన్ని కుటుంబాలు, వర్గాలు మాత్రమే ప్రయోజనం (రిజర్వేషన్లు) పొందుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తమ స్పందనను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మిగతా పెండింగ్ పిటిషన్లతో జత చేసింది.