స్కూళ్లు తెరవాలంటూ సుప్రీంకోర్టులో స్టూడెంట్ పిటిషన్

స్కూళ్లు తెరవాలంటూ సుప్రీంకోర్టులో స్టూడెంట్ పిటిషన్
  • ఇలాంటి పిటిషన్లు వేయడం కాదు.. చదువుపై దృష్టి సారించడమంటూ స్టూడెంట్ కు సుప్రీం కోర్టు సలహా
  • అన్ని ప్రాంతాల్లో పాలనను చేతుల్లోకి తీసుకోలేమంటూ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులో ఉన్నందున స్కూళ్లన్నీ తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీలో 12వ తరగతి చదువుతున్న అమర్ ప్రేమ్ ప్రకాష్ అనే విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయని చెబుతున్నా.. అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు ఉపయోగించుకునే పరిస్థితిలో లేరని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులు చదువుకునేందుకు స్కూళ్లు తెరవాలని కోరుకుటుంటన్నారని.. వారిందరి తరపున తాను ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నానని ప్రేమ్ ప్రకాష్ పేర్కొన్నాడు. 
12వ తరగతి విద్యార్థి వేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. దేశవ్యాప్తంగా ఒకే పరిస్థితి లేదని.. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితులను బట్టి నిబంధనలు ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు ఇలాంటి పిటిషన్లు వేయడం కంటే.. చదువుకోవడంపై దృష్టిపెడితే మేలని.. సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఈ పిటిషన్ ను పబ్లిసిటీ కోసం వేసినట్లు భావించడం లేదంటూనే.. పిల్లలు ఇలాంటి పిటిషన్లు వేయడం ఒకరకంగా సమయం వృధామాత్రమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.  వేర్వేరు రాష్ట్రాల్లోని పాలనను తాము ఆధీనంలోకి తెచ్చుకోలేమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెబుతూ స్టూడెంట్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.