విద్యుత్ బకాయిలపై సమగ్ర విచారణ తర్వాతే నిర్ణయం : సుప్రీం కోర్టు

విద్యుత్ బకాయిలపై సమగ్ర విచారణ తర్వాతే నిర్ణయం :  సుప్రీం కోర్టు
  • మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని ఏపీకి తేల్చి చెప్పిన సుప్రీం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్ బకాయిల వివాదంపై సమగ్ర విచారణ తర్వాతే మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏపీ జెన్ కో నుంచి తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసిన వ్యవహారంలో విద్యుత్ బకాయిల అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ డిస్కంల నుంచి బకాయి పడ్డ రూ. వేల కోట్లను తక్షణమే ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ జెన్ కో కేంద్రాన్ని ఆశ్రయించింది. 

ఏపీ విజ్ఞప్తి మేరకు రూ. 6,756 కోట్లు 30 రోజుల్లో చెల్లించాలని తెలంగాణకు కేంద్రం సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా... కేంద్ర ఆదేశాలకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులిచ్చింది. పీపీఏల్లో పేర్కొన్న ఫోరానికి వెళ్లకుండా ఏపీ జెన్‌‌‌‌‌‌‌‌కో నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించడం,  తెలంగాణ డిస్కంల అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.

ఏపీ విభజన చట్టం-2014 సెక్షన్‌‌‌‌‌‌‌‌ 92 కింద కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. హైకోర్టు తీర్పును 24 నవంబర్ 2023న ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలో ని ధర్మాసనం విచారించింది. ఏపీ జెన్‌‌‌‌‌‌‌‌కో తరఫు న్యాయవాది వాదిస్తూ..తమకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ డిస్కంలపై ఉందన్నారు.

బకాయిలు మొత్తం కాకపోయినా, కనీసం వివాదం లేని మొత్తాన్నైనా చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే, తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. డిసెంబర్ మొదటి వారంలో సమగ్ర విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొంది.