ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్షాలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులపై 6వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్గురువారం విచారించింది. సుస్మితా దేవ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తాము ఈసీకి 11 ఫిర్యాదులు చేస్తే రెండింటిపైనే నిర్ణయం తీసుకున్నారన్నారు. మే 6న కేసు విచారించే సమయానికి మిగతా వాటిపై ఈసీ నిర్ణయం తీసుకోవాలని బెంచ్ ఆదేశించింది.
పోటీకి అనర్హునిగా ప్రకటించండి…
సిటిజెన్ షిప్ వివాదం తేలేవరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్ గాంధీని అనర్హునిగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కేంద్రం, ఈసీలకు ఆదేశాలు జారీ చేయాలంటూ జై భగవాన్ గోయల్, సీపీ త్యాగీ పిటిషన్లో కోరారు. సిటిజెన్షిప్ వివాదం తేలేవరకూ ఓటరు జాబితా నుంచి రాహుల్ పేరును తొలగించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ లాయర్ బరుణ్ కుమార్ సిన్హా మరో పిటిషన్ దాఖలు చేశారు.
