కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పై ఎస్ఎల్పీ కొట్టివేత

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పై  ఎస్ఎల్పీ కొట్టివేత
  • హైకోర్టు సీజే బెంచ్ విచారణ జరపాలని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ స్కీములను నిలిపివేయాలని దాఖలైన రిట్ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు సీజే లేదా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు జాబితా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.  శాసన సభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వం జారీ చేసిన జీవోల ద్వారా ఈ స్కీంలను అమలు చేయడం రాజ్యాంగ విరుద్దమని లాయర్ విజయ్ గోపాల్ ఈ ఏడాది జూలైలో హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ జరిపిన ఏకసభ్య బెంచ్... ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమవ్వడంతో ఈ స్కీంల అమలుపై ఆగస్టు 20న స్టే విధించింది. అయితే.. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 1న స్టే ను తొలగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. డివిజన్ బెంచ్ తీర్పును విజయ్ గోపాల్ అక్టోబర్ 15న సుప్రీంకోర్టులో  సవాల్ చేశారు. ఆ పిటిషన్ ను గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బగ్చి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ వ్యక్తిగతంగా వాదించేందుకు కోర్టు అనుమతించింది. వాదనలు విన్న ధర్మాసనం.. సెప్టెంబర్ 1 నాటి హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.