కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు : సుప్రీంకోర్టు

కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు : సుప్రీంకోర్టు
  • సీఎం రేవంత్​పై బీజేపీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం
  • రాజకీయ నాయకులకు విమర్శలు ఎదుర్కొనే నైపుణ్యం ఉండాలని బీజేపీకి చురక
  • పిటిషన్‌‌‌‌ కొట్టేసిన సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, వెలుగు: న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. విమర్శలను ఎదుర్కొవాలంటే రాజకీయ నాయకుడు మందమైన చర్మాన్ని కలిగి ఉండాలని.. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిపై తెలంగాణ బీజేపీ పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​ అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో మే 4 న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌‌‌‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టతను దెబ్బతీశాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది ఫిర్యాదు చేశారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌‌‌‌ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. దీంతో రేవంత్‌‌‌‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆగస్టు 1న ట్రయల్‌‌‌‌ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ గత నెల 28న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​ నేతృత్వంలోని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌‌‌‌‌‌‌‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 తెలంగాణ బీజేపీ తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్, రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తొలుత రంజిత్ కుమార్ వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని సూచించారు. ‘‘రాజకీయ పోరాటాలకు కోర్టులను ఉపయోగించుకోవద్దని పదేపదే చెబుతున్నాం. మీరు రాజకీయ నాయకుడు అయితే విమర్శలను ఎదుర్కొనే, భరించే నైపుణ్యం మీకు ఉండాలి. 

రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి”అంటూ ఈ పిటిషన్‌‌‌‌ను డిస్మిస్ చేస్తున్నామని వెల్లడించారు. న్యాయవాది రంజిత్ కుమార్ తన వాదనలను పొడిగించే ప్రయత్నం చేయగా.. సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఇతర కేసుల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి పిటిషన్లు వేస్తే.. రూ.5 వేలు, రూ.25 వేలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తామంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అనంతరం ఈ పిటిషన్‌‌‌‌పై విచారణను ముగిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.