బిల్కిస్ బానో కేసులో.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్..

బిల్కిస్ బానో కేసులో.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్..

బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మందికి వేసిన జైలు శిక్షను రద్దు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  క్షమాభిక్ష పెడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. దోషులకు క్షమాపణలు ఇచ్చే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఆ ఖైదీలకు రెమిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టేవేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పును రిజర్వ్ చేస్తూ, బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్ష తగ్గించడానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను అక్టోబర్ 16లోగా సమర్పించాలని కేంద్ర మరియు గుజరాత్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..

మార్చి 2002లో గోద్రా అల్లర్ల సమయంలో, బానో పై సామూహిక అత్యాచారం జరిగింది. మరియు ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులతో చనిపోవడానికి కారణమైంది. గుజరాత్ లోని వడోదరలో జరుగుతున్న మత ఘర్షణల నుంచి బానో తప్పించుకునే ప్రయత్నంలో  ఆమె  సామూహిక అత్యాచారానికి గురైంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు మరియు ఆమె ఐదు నెలల గర్భిణి. అత్యాచారం మరియు తన కుటుంబ సభ్యుల మర్డర్ పై ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు 2008లో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది.  

ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 15న విడుదల చేసింది. 2008లో దోషులుగా తేలిన సమయంలో గుజరాత్‌లో అమలులో ఉన్న రిమిషన్ పాలసీ ప్రకారం ఈ కేసులోని దోషులందరూ విడుదలయ్యారు. దోషులను విడుదల చేయడం పట్ల బానో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమెకు మద్దతుగా సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ,  రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా పిటీషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి శిక్ష రద్దు చేసే అధికారం లేదని తీర్పు ఇచ్చింది.