సీఎం జగన్ కు ఝలక్…సుప్రీం కీలక నిర్ణయం

సీఎం జగన్ కు ఝలక్…సుప్రీం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఇవాళ(సోమవారం) విచారించింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌  ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులు పని చేయకుండా పిటిషన్లు వేయడం ప్రమాదకరమని తెలిపింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేసింది. దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తుంటే…ఏపీలో ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించింది.  రాజ్యాంగ ఉల్లంఘనలను ఎంత మాత్రం ఆమోదించబోమని సుప్రీం స్పష్టం చేసింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అడ్డంకులు తొలగడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే రీషెడ్యూల్ చేయడంతో.. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుదో దశగా మార్చారు. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు.

షెడ్యూల్ కొత్త పోలింగ్ తేదీలను కూడా ప్రకటించింది ఎస్ఈసీ. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా… తాజాగా, 9, 13, 17,21 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది.