ఏపీ పంచాయతీ ఎన్నికలపై రేపు సుప్రీంలో విచారణ

ఏపీ పంచాయతీ ఎన్నికలపై రేపు సుప్రీంలో విచారణ

ఆంధ్రప్రదేశ్  పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై రేపు(సోమవారం) విచారణ జరగనుంది. అయితే.. ఈ పిటిషన్ ను మొదట జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం విచారిస్తుందని నిర్ణయించినా, అందులో మార్పు జరిగింది. ఇప్పుడా పిటిషన్ విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి బదిలీ అయింది. సుప్రీంకోర్టులో సోమవారం విచారణ లిస్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తో పాటు ఉద్యోగ సంఘాల పిటిషన్లు కూడా ఉన్నాయి.

ఏపీలో ఎన్నికలు వద్దంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. ఈ తీర్పుపై రాష్ట్ర సర్కారు సుప్రీంకు వెళ్లగా, ఎస్ఈసీ అంతకుముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.