
Supreme Court on Dogs: దేశరాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకున్న తర్వాత విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడిలో పిల్లల నుంచి పెద్దవారి వరకు దాడికి గురవుతున్న కేసులు భారీగా రికార్డ్ అవుతున్న వేళ సుప్రీం కోర్టు రంగప్రవేశం చేసింది.
తొలుత ఆగస్టు 11న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని అన్ని వీధికుక్కలను షెల్డర్లకు తరలించాలని ముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఆగస్టు 22 శుక్రవారం గత తీర్పులో కొన్ని సవరింపులు చేసిన ధర్మాసనం కేవలం అగ్రసివ్, పిచ్చికుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.
కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసిన కోర్ట్ డాగ్ లవర్స్, ఎన్‌జీఓలు రూ.25,000–2 లక్షలు జమచేయాలని ఆదేశించింది.
ఇదే క్రమంలో షెల్టర్లకు తరలించే కుక్కలను స్టెరిలైజేషన్, రోగనిరోధకతకు సంబంధించిన వైద్యపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత వాటిని మళ్లీ విడిచిపెట్టాలని కోర్టు తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రేబిస్ సోకిన లేదా అగ్రసివ్ ప్రవర్తనను కలిగి ఉన్న కుక్కలు తప్ప.. అన్ని వీధి కుక్కలకు ఈ ఉత్తర్వు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వడం నిషేధించబడిందని చెప్పిన కోర్ట్.. దానిని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక వీధి కుక్కలకు ఆహారం కోసం ప్రత్యేక దాణా ప్రాంతాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.