బంజారా, లంబాడా, సుగాలీల..ఎస్టీ హోదాపై మీ వైఖరి ఏంటి?..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

బంజారా, లంబాడా, సుగాలీల..ఎస్టీ హోదాపై మీ వైఖరి ఏంటి?..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: బంజారా, లంబాడా, సుగాలీల ఎస్టీ హోదాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మూడు వర్గాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, మాజీ ఎంపీ సోయం బాపు రావు, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున సీనియర్  అడ్వొకేట్  అల్లంకి రమేశ్ గత నెల 24 న పిటిషన్  దాఖలు చేశారు. జడ్జిలు జస్టిస్  జేకే మహేశ్వరి, జస్టిస్  విజయ్  బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్  శుక్రవారం విచారణకు వచ్చింది. 

పిటిషనర్ల తరపు సీనియర్  అడ్వొకేట్  దామా శేషాద్రి, న్యాయవాది రమేశ్ అల్లంకి వాదనలు వినిపించారు. బంజారా, లంబాడా, సుగాలీలు గిరిజనులు కాదని, 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలసవచ్చి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని పిటిషన్ లో ఆరోపించారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. బంజారా, లంబాడా, సుగాలీలను తిరిగి బీసీ సామాజికవర్గంలో చేర్చేలా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న బెంచ్.. ఈ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.