ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు అమ్మి భారీగా లాభాలు సంపాదించిన ఫారిన్ ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కంపెనీ సంపాదించిన క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ చెల్లించాలని తీర్పిచ్చింది. 2024లో ఢిల్లీ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. టైగర్ గ్లోబల్ 2011 నుంచి 2015 మధ్య ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. 2018లో తన వాటాలను వాల్‌మార్ట్‌కు అమ్మి, సుమారు రూ.13 వేల కోట్ల లాభం సాధించింది. కానీ, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కంపెనీ ప్రయత్నించిందనే ఆరోపణలు, పెనాల్టీ, వడ్డీలు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కలిపి మొత్తం రూ.14,500కోట్ల పన్ను కట్టాలని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ డిమాండ్ చేస్తోంది.
మారిషస్‌లో డొల్ల కంపెనీనే
యూఎస్‌కి చెందిన టైగర్ గ్లోబల్ కంపెనీ మారిషస్‌లోని ప్రైవేట్ కంపెనీలు టైగర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ 2, 3, 4 హోల్డింగ్స్ (టీజీఐ) ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లోని వాటాలను హోల్డ్ చేసింది. మారిషస్, ఇండియాకి మధ్య కుదిరిన డబుల్ ట్యాక్సేషన్ అవైడన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ) కింద ఇండియాలో మారిషస్ కంపెనీలు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికెట్ (టీఆర్‌సీ) ఉందని, దీని ప్రకారం మారిషస్‌లో ట్యాక్స్ కడితే ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని టైగర్ గ్లోబల్ వాదిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టుకి వెళ్లగా, అక్కడ సానుకూలంగా తీర్పు లభించింది. సుప్రీంకోర్టు మాత్రం కేవలం టీఆర్‌సీ ఉంటే సరిపోదని, ఆ దేశంలో కంపెనీకి నిజమైన వ్యాపారాలు ఉన్నాయో లేదో చూడడమూ ముఖ్యమని తెలిపింది.
యూఎస్ బేస్డ్ కంపెనీ టైగర్ గ్లోబల్‌కి మారిషస్‌లోఉన్నవి డొల్ల కంపెనీలని పేర్కొంది. దీంతో ఇండియాలో ట్యాక్స్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలని తీర్పిచ్చింది. సుప్రీం కోర్ట్ తీర్పుతో ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టడంపై తమ స్ట్రాటజీలను మారుస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. “సుప్రీం కోర్ట్ టైగర్ గ్లోబల్ కేసులో కీలకమైన తీర్పిచ్చింది. ఇక నుంచి కేవలం ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే పన్ను ఒప్పందాల కింద ప్రయోజనాలు పొందలేరు. ఆయా దేశాల్లో వాస్తవంలో వ్యాపారాలు ఉండాలని సుప్రీం కోర్ట్ నొక్కి చెప్పింది. ట్యాక్స్ పేయర్లు తమ ఎగ్జిట్ స్ట్రాటజీలను మార్చుకోవాల్సి ఉంటుంది”అని గ్రాంట్ థార్నటన్ భారత్ ట్యాక్స్ పార్టనర్ రిచా సావ్నీ వివరించారు.
