
- అరెస్ట్ చేయకూడదనే వినహాయింపుపై న్యాయ సలహాలు
- కస్టడీలోకి తీసుకుని విచారించాలని చూస్తున్న సిట్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. అరెస్ట్ చేయకుండా విచారించాలని ఆగస్టు 5వ తేదీ వరకు ఉన్న మినహాయింపులను రద్దు చేయించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. విచారణలో ప్రభాకర్ రావు సరైన సమాచారం ఇవ్వడం లేదని.. ఇందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. కాగా ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 5న విచారణ జరగనుంది.అప్పటిలోగా ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది.
మినహాయింపు రద్దు చేసి.. కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా..?
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభాకర్ రావును సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఐదుసార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రతి రోజు 8 గంటల చొప్పున విచారించారు. అయితే, సిట్ విచారణకు హాజరవుతున్నప్పటికీ ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించడం లేదని సిట్ భావిస్తోంది. ఎస్‌ఐబీ లాగర్, హార్డ్ డిస్కుల ధ్వంసం సహా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ప్రతి అంశం తనకు తెలిసినప్పటికీ చెప్పడం లేదని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు సహా ఇందుకు ప్రేరేపించిన ప్రముఖుల గురించి ఆధారాలతో ప్రశ్నించినప్పటికీ వివరాలు వెల్లడించడం లేదని తెలిసింది. సిట్ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అయితే, ఎలాంటి స్వప్రయోజనం లేకున్నా.. పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు సహా వేల సంఖ్యలో ఫోన్లను ట్యాపింగ్ చేయడంపై సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ఈ క్రమంలోనే సుప్రీం ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తే కస్టోడియల్ విచారణకు తీసుకుని విచారించేందుకు అనువైన మార్గాలను సిట్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.