విద్యార్థులను కొట్టినోళ్లను వదిలిపెట్టం: లాఠీచార్జ్‏పై సిట్ విచారణకు సుప్రీం ఆదేశం

విద్యార్థులను కొట్టినోళ్లను వదిలిపెట్టం: లాఠీచార్జ్‏పై సిట్ విచారణకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల శాంతియుత ఆందోళనను పోలీసులు బలప్రయోగంతో అణిచివేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారులపై లాఠీచార్జ్‏, టియర్ గ్యాస్ ప్రయోగం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై సుప్రీం కోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే..?

నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చలో పార్లమెంట్‎కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 

పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఈ ఇష్యూ సుప్రీం కోర్టుకు చేరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం (జులై 28) ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. 

విద్యార్థులపై దాడులకు సంబంధించిన సాక్ష్యాలను పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల శాంతియుత ఆందోళనను పోలీసులు బలప్రయోగం చేసి అణిచివేయడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్, ఎలక్ట్రిక్ లాఠీలు, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై మండిపడ్డారు.

 పెల్లెట్ గన్‎లతో ఓ యవకుడు కంటిచూపు కోల్పోయాడు.. మేకులు అమర్చిన లాఠీలతో కొట్టడం వల్ల పలువురు విద్యార్థులు గాయపడ్డారు.. ఓ యువతిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హద్దులు దాటి అమాయక విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడిన వారిపై చట్టం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ALSO READ : మీ వీడియో డిలీట్ చేసినందుకు క్షమించండి

 ఇందులో భాగంగా విద్యార్థులపై జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని.. అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని అన్నారు. విచారణ కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేశారు.