పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలో.. ‘మేఘా’ వేల కోట్ల అవినీతి

పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలో.. ‘మేఘా’ వేల కోట్ల అవినీతి
  • సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తరఫు లాయర్‌‌‌‌ వాదనలు
  • నేడు విచారణ చేపట్టేందుకు ద్విసభ్య ధర్మాసనం అంగీకారం

న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో మేఘా కంపెనీ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తాము చేస్తున్న ఆరోపణలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) తన అఫిడవిట్ లో సమర్థించిందని కోర్టుకు నివేదించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తొలుత హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తు 2019, మార్చి 5 వ తేదిన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ గా సేవలందించారని కోర్టకు నివేదించారు. అలాగే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నుంచి ఈ ఎత్తిపోతల స్కీమ్ లో అవినీతిపై భారీ సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. ఈ అవినీతి విషయంలో సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించిందని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లులు, తదుపరి తమ బాధ్యత వంటి విషయాలను ఈ అఫిడవిట్ లో పేర్కొన్నట్లు తెలిపారు.

 అయితే.. బీహెచ్ఎఈఎస్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ అవినీతిపై తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని వాదనలు కొనసాగించారు. ప్రభుత్వ టెండర్ లో మూడో వంతు కూడా బీహెచ్ఈఎల్ కు చెల్లించలేదని అఫిడవిట్ లో స్పష్టమైందన్నారు. అలాగే మెగా సంస్థ అవినీతిపై సీఏజీ (కాగ్) కూడా రిపోర్ట్ ఇచ్చిందని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల తమ వాదనలన పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై మేఘా సంస్థ తరఫు అడ్వొకేట్ లు అభ్యంతరం తెలిపారు. మధ్యలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని.. ఇదే అంశంపై హైకోర్టు లో రిట్ పిటిషన్ వేశారా? అని పిటిషనర్ ను ప్రశ్నించింది. 

ఆ పిటిషన్లలో చాలా వాటిని హైకోర్టు డిస్మిట్ చేసిందని, అయితే ప్రస్తుతం తాము పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలో మెగా కంపెనీ అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు నివేదించారు. అయితే.. ఈ పిటిషన్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విచారిస్తామని తొలుత జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. దీంతో మరోసారి పిటిషనర్ అడ్వొకేట్ వాదనలు కొనసాగిస్తూ.. దాదాపు 2019 నుంచి ఈ పిటిషన్ పెండింగ్ లో ఉందని, బీహెచ్ఈఎస్ ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లోని అంశాలను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం... బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వినేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ.. విచారణ వాయిదా వేసింది.