
- పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు తీర్పు
- కోర్టు ధిక్కార పిటిషన్ పై మరోసారి తేల్చిచెప్పిన ధర్మాసనం
- తదుపరి విచారణకు అధికారులు కోర్టులో హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: దత్తత పేరుతో పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే తిరిగి ఆ చిన్నారులను అప్పగించాలని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం 11 గంటల లోపు ఆ చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే గతంలో ఇచ్చిన తమ ఆదేశాలను పాటించని అధికారులు తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 2న కోర్టులో హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తొమ్మిది మంది తల్లిదండ్రులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
అయితే.. ఈ సింగిల్ బెంచ్ పేరెంట్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ.. స్టేట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ పై వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతో పాటు మరో ముగ్గురు పేరెంట్స్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదన విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ వేసింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే పిల్లల్ని ఇవ్వాలని ఆగస్టు12న తుది తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 142 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. 14 వ తేదీ వరకు వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే.. అంతకన్నా ముందే ఈ తీర్పు ను రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పిల్ కు వెళ్లింది.
అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇదిలా ఉండగా... కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ నెల 18న సుప్రీకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ ముందుకు వచ్చింది. గత తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు వారి తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున ఏఎస్ జీ హాజరై.. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం.. ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నలుగురు పేరెంట్స్కు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న రాష్ట్ర హైకోర్టుకు ముందుకు రానుంది.
అసలేం జరిగిందంటే..
గతేడాది మే లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తో ఈ పిల్లల అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. మహిళా ఆర్ఎంపీ డాక్టర్ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఎంక్వైరీలో.. ఆ ఆర్ఎంపీ మొత్తం 16 మంది చిన్నారులు అమ్మినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు చిన్నారులు అమ్మకం దశలోనే పట్టుకోగా.. మరో 9 మంది పిల్లల్ని అప్పటికే అక్రమ రవాణా ముఠా అమ్మేసినట్లు గుర్తించారు. దీంతో ఆ తొమ్మిది మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల ఆచూకీ గుర్తించి వారి నుంచి చిన్నారులను తీసుకొని రాష్ట్ర మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది.