
న్యూఢిల్లీ : అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. తాము ఉన్నతమైన రాజ్యాంగబద్ధ వ్యవస్థలతో వ్యవహరిస్తున్నామని చెబుతూనే.. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపలేరని స్పష్టం చేసింది.
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గవర్నర్ వెనక్కి పంపిన 10 బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ ఇటీవల మరోసారి ఆమోదం తెలిపింది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించింది. అయితే.. గవర్నర్ వాటిని రాష్ట్రపతికి రిజర్వ్ చేశారని తమిళనాడు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. బిల్లులను శాసనసభ రెండోసారి ఆమోదించిన తర్వాత గవర్నర్ వాటిని రాష్ట్రపతికి పంపలేరని కోర్టు చెప్పింది.