సీఎస్‌‌లు విచారణకు రావాల్సిందే ..వీధి కుక్కల కేసులో తేల్చి చెప్పిన సుప్రీం

సీఎస్‌‌లు విచారణకు రావాల్సిందే ..వీధి కుక్కల కేసులో తేల్చి చెప్పిన సుప్రీం

న్యూఢిల్లీ: వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన కేసులో నవంబర్ 3న జరగనున్న విచారణకు వర్చువల్‌‌గా హాజరయ్యేందుకు అనుమతించాలని బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీ(సీఎస్)లు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్ ప్రకారం.. వీధి కుక్కల విషయంలో తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అధికారులెవరూ పట్టించుకోలేదని, అసలు వారికి కోర్టు తీర్పులంటే గౌరవం లేకుండా పోయిందని అసహనం వ్యక్తంచేసింది. 

స్ట్రే డాగ్స్ కేసులో అక్టోబర్ 27న సుప్రీం కోర్టు స్పందిస్తూ.."ఏబీసీ రూల్స్ అమలుపై ఆగస్టు 22నాటికి అఫిడవిట్లు దాఖలు చేయాలని 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీల ప్రధాన కార్యదర్శులను ఆదేశించాం. కానీ, చాలా రాష్ట్రాలు కోర్టు ఆదేశాలను పాటించలేదు" అని తీవ్రంగా మండిపడింది. అఫిడవిట్ దాఖలుకు ఇంత లేటెందుకని ఫైర్ అయింది.

 దీనిపై నవంబర్ 3న జరిగే విచారణకు సీఎస్​లు వ్యక్తిగతంగా  హాజరై వివరించాలని ఆదేశించింది. కానీ, భౌతిక హాజరు బదులు వర్చువల్‌‌గా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ సీఎస్​లు పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.."అధికారులు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారా?  వర్చువల్‌‌ హాజరుకు  అనుమతించే ప్రసక్తే లేదు. సీఎస్ లు కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే" అని తీవ్రంగా మందలించింది. తమ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయని వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని బిహార్ సీఎస్ అభ్యర్థననూ తోసిపుచ్చింది.