
న్యూఢిల్లీ: సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ను ఏర్పాటు చేసి ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అంతేకాదు.. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందిన డబ్బును రికవరీ చేసుకుని, ఆ పార్టీల ఆదాయపు పన్ను లెక్కలను పరిశీలించమని అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు, కార్పొరేట్లకు మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని పెద్ద ఎత్తున అభియోగాలొచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల గురించి పిటిషన్లలో పేర్కొన్న అంశాలనీ ప్రస్తుత తరుణంలో ఊహాజనితమైనవిగా ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్లపై దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ జరిపింది. సీపీఐఎల్, డాక్టర్.ఖేమ్ సింగ్ భాట్టి, సుదీప్ నారాయణ్ తమన్కర్, ప్రకాశ్ శర్మ ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలని కోరుతూ ఈ పిటిషన్లను దాఖలు చేయడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్లపై న్యాయ సమీక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేసి ఉన్నట్టయితే కచ్చితంగా విచారణకు స్వీకరించే పరిస్థితి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. కానీ.. ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం జరిగిందనే నేరారోపణలపై సాధారణ చట్టంలో విచారించే అవకాశం ఉన్నప్పటికీ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించాలని డిమాండ్ చేయడం సముచితం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆర్థిక నేరానికి పాల్పడినట్లు చేస్తున్న అభియోగాలు ఆర్టికల్ 32 కిందకు రావని తెలిపింది.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు, విరాళాల్లో పారదర్శకత పేరుతో ఈ ఎలక్టోరల్ బాండ్లను 2017లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ మొత్తంగా రూ.6,986.5 కోట్ల విరాళాలు పొంది అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా నిలిచింది. 2019-20 సంవత్సరంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.2,555 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయి. బీజేపీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా తృణముల్ కాంగ్రెస్ (రూ.1,397 కోట్లు) నిలిచింది. ఇన్ని వేల కోట్లు విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు అందడంతో దేశం నివ్వెరపోయింది. ఈ ఎలక్టోరల్ బాండ్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించడంతో 2024 ఫిబ్రవరిలో ఈ ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఊరూపేరు లేని విరాళాలు అందుతున్నాయని, ఈ విధానం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా జరగడం పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఇవ్వడమేనని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ప్రామిసరీ నోట్ల లాంటివే ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే. దేశంలోని ఏ పౌరుడైనా లేదా సంస్థ అయినా ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ బ్రాంచుల్లో ఇవి అందుబాటులో ఉండేవి. రూ.1000 నుంచి మొదలుకుని కోటి రూపాయల విలువైన బాండ్ల వరకూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్టోరల్ బాండ్ కొనాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ ఏదైనా బ్యాంకుకు కేవైసీ సమర్పించి ఈ ఎన్నికల బాండ్ను కొనుగోలు చేయవచ్చు. ఆ ఎలక్టోరల్ బాండ్ను నచ్చిన రాజకీయ పార్టీకి విరాళాల రూపంలో అందజేయొచ్చు. కొన్న 15 రోజుల వరకూ మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లు చెల్లుతాయి. న్యూఢిల్లీ, గాంధీనగర్, ఛండీఘర్, బెంగళూరు, భోపాల్, ముంబై, జైపూర్, లక్నో, చెన్నై, కోల్కత్తా, గౌహతి నగరాలతో పాటు దేశంలోని 29 ఎస్బీఐ బ్రాంచుల్లో ఈ ఎలక్టోరల్ బాండ్లు అందుబాటులో ఉండేవి. సుప్రీం కోర్టు నిలుపుదల చేయడంతో ఈ ఎలక్టోరల్ బాండ్లు కనుమరుగైపోయాయి.