నీట్‌ పీజీ ఎగ్జామ్‌ సెంటర్ల మార్పుపై పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం

నీట్‌ పీజీ ఎగ్జామ్‌ సెంటర్ల మార్పుపై పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ: మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు సంబంధించి కేటాయించిన సెంటర్లలో మార్పు కోరుతూ తొమ్మిది మంది డాక్టర్లు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. శనివారం జరగబోయే ఈ పరీక్ష రాసేందుకు కొంత మంది ఇతర రాష్ట్రాలకు, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వారికి వైరస్ సోకే ముప్పు తగ్గించేందుకు సెంటర్ మార్పుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై ఇవాళ (గురువారం) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశంలో ట్రావెల్ సహా అన్ని నార్మల్‌గా నడుస్తున్నాయని జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ప్రజలు ప్రతి చోటుకీ ప్రయాణాలు చేస్తున్నారని, ఈ రోజు ఎయిర్‌‌పోర్టుకు వెళ్లి చూస్తే ప్రతి ఫ్లైట్ పూర్తిగా బుకింగ్ అయ్యి ఫుల్‌గా కనిపిస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ కోసం ప్రయాణం చేయడం సమస్య కాదని తెలిపింది.

వారణాసి నుంచి కేరళకు వెళ్లాలి..

పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ‘‘నీట్ పీజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక డాక్టర్ (9 మంది పిటిషనర్లలో ఒకరు) వారణాసిలో కరోనా విధుల్లో ఉన్నారు. అక్కడ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి బాగా కంట్రోల్‌లో ఉంది. కానీ ఆ అప్లికెంట్ ఇప్పుడు కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న కేరళకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంది. మిగిలిన పిటిషనర్లు కూడా ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ సమయంలో సుదూర ప్రయాణాల వల్ల వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది” అని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘నీట్ పీజీకి దరఖాస్తు చేసుకున్న యువ డాక్టర్లు మార్చి 15న సెంటర్లకు ఆప్షన్‌ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో వాళ్ల పోస్టింగ్‌కు దగ్గరగా ఉండేలా సెంటర్లు పెట్టుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా పరీక్ష ఏకంగా సెప్టెంబర్ 11కు వాయిదా పడింది. ప్రస్తుతం వాళ్లు డ్యూటీలు చేస్తున్న ఏరియాలు మారిపోయాయి. పైగా పిటిషనర్లలో నలుగురు కేరళకో లేదా కేరళ నుంచి వేరే రాష్ట్రానికో ప్రయాణం చేయాల్సి ఉంది. అంటే దీని వల్ల వాళ్లు కరోనా బారినపడే ప్రమాదమే కాక.. ఇతరులకు వ్యాప్తి అయ్యేందుకు కారణమయ్యే చాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం కేరళలో కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 6 నుంచి ఆ రాష్ట్రంలో జరగాల్సిన 11వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ను ప్రభుత్వం నిలిపేసింది. ఈ నేపథ్యంలో తన పిటిషనర్లకు ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ఏరియాలో సెంటర్లన ఎంచుకునే అవకాశం ఇవ్వాలి” అంటూ మీనాక్షి తన వాదనలను వినిపించారు. 

ఈ సందర్భంగా ధర్మాసనం.. ప్రస్తుతం చాలా వరకు వ్యాక్సిన్‌ వేసుకుని ఉన్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి గతంలో ఉన్నంత తీవ్రంగా లేదంటూ ప్రజా జీవనం చాలా వరకు నార్మల్ అయిన విషయాన్ని గుర్తు చేసింది. వారం క్రితం ఇద్దరు మహిళా డాక్టర్లు నిండు గర్భంతో ఉన్న కారణంగా దూర ప్రయాణాలు చేయడం ఇబ్బంది అని కోర్టును ఆశ్రయించడంతో నీట్ పీజీ ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం ఇచ్చినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం కోరుటున్న పిటిషనర్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టేస్తున్నామని సుప్రీం స్పష్టం చేసింది.