
- మే4న ఘటన జరిగితే.. 18వ తేదీ ఎఫ్‌ఐఆర్ నమోదు
- సిట్ లేదా మాజీ జడ్జిలతో మేమే కమిటీ వేస్తం: సుప్రీం
- జీరో ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టుల వివరాలివ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నం గా ఊరేగించిన ఘటన భయానకమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. ఆశ్రయం కోసం వచ్చిన బాధిత మహిళలను పోలీసులే అల్లరి మూకకు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయని.. కేసు దర్యాప్తును వారికి అప్పగించలేమని స్పష్టం చేసింది. మణిపూర్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి సిట్ లేదా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే, మంగళవారం కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు విన్న తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మణిపూర్ హింసపై దాఖలైన అన్ని పిటిషన్లను మంగళవారానికి లిస్ట్ చేసింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగితే.. మే 18వ తేదీ దాకా పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ‘‘పోలీసులు ఏం చేస్తున్నారు? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి 14 రోజులు ఎందుకు పట్టింది? జూన్ 24న ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ను మెజిస్టీరియల్ కోర్టుకు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు” అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ నిలదీసింది.
ఇప్పటికే లేట్ అయింది..
తమకు కాస్త సమయం ఇవ్వాలంటూ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోరడంపైనా సుప్రీం సీరియస్ అయింది. ‘‘ఇప్పటికే సమయం మించిపోతోంది.. సర్వస్వం కోల్పోయిన వారికి మనోధైర్యం అందించాల్సిన అవసరం చాలా ఉంది” అని చెప్పింది. మణిపూర్ హింసపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌లు, జరిగిన అరెస్టులపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత ప్రజల కోసం రాష్ట్రానికి ఇస్తున్న పునరావాస ప్యాకేజీ గురించి కూడా తాము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. ‘‘6000 ఎఫ్‌ఐఆర్‌లలో ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి? ఎన్ని జ్యూరిస్ డిక్షనల్ మేజిస్ట్రేట్‌కు ఫార్వార్డ్ అయ్యాయి? ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎంత మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు? లైంగిక హింసకు సంబంధించినవి ఎన్ని ఉన్నాయి? అనేది మేం
తెలుసుకోవాలి” అని వ్యాఖ్యానించింది.
ఆ ఇద్దరు మహిళల పిటిషన్
ఇద్దరు మహిళల తరఫున పిటిషన్ దాఖలు చేసినట్లు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తెలిపారు. లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు బాధితుల ఐడెంటిటీకి ప్రొటెక్షన్ కల్పించాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ వేశారు.