
‘రాఫెల్ ఫైటర్ జెట్ల డీల్ కు ఫ్రాన్స్ సర్కారు పూచీ ఉండే నిబంధనను ఎందుకు తొలగించారు. టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ క్లాజ్ ను అసలు డీల్ లో లేకుండా ఎందుకు చేశారు” అంటూ సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాఫెల్ తీర్పును రివ్యూ చేయాలంటే దాఖలైన పిటిషన్లను సీజేఐ రంజ్ గొగోయ్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఇందుకు ఇదేమీ కొత్తగా జరగలేదని, అమెరికా, రష్యాతో ఇండియా గతంలో ఇలా చాలా ఒప్పందాలు చేసుకుందని కేంద్ర తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది టెక్నికల్ అంశం కాబట్టి కోర్టు వాటిని నిర్దేశించజాలదని చెప్పారు. ‘‘ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం.
ప్రపంచంలో మరే కోర్టు రక్షణ డీల్స్ పై ఇలాంటి వాదనలను పరిగణలోకి తీసుకోదు”అని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు వాదించిన అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సివుందన్నారు. ఇద్దరి వాదనలు విన్న బెంచ్ రెండు వారాల్లోగా లిఖిత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.