టాకీసుల్లోకి బయటి ఫుడ్​పై.. ఓనర్ల నిర్ణయమే ఫైనల్

టాకీసుల్లోకి బయటి ఫుడ్​పై.. ఓనర్ల నిర్ణయమే ఫైనల్

న్యూఢిల్లీ: సినిమా టాకీసుల్లోకి బయటి ఫుడ్​ను, డ్రింక్స్ ను అనుమతించాల్నా? వద్దా? అనే విషయంపై టాకీస్ ఓనర్ల నిర్ణయమే ఫైనల్ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మల్టీప్లెక్స్​లు, సినిమా హాళ్లు ప్రైవేట్ ప్రాపర్టీలు అని, అక్కడ ప్రజా ప్రయోజనాలు, భద్రత, సంక్షేమాలకు విరుద్ధమైనవి కాకుండా ఎలాంటి నిబంధనలు విధించాలన్నది ఓనర్ల ఇష్టమని స్పష్టం చేసింది. సినిమా టాకీసులు, మల్టీప్లెక్స్ లలోకి బయటి ఫుడ్ ను, వాటర్​ను తీసుకురావడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ జమ్మూకాశ్మీర్ హైకోర్టు 2018 జులైలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటిందని అభిప్రాయపడుతూ ఆ తీర్పును కొట్టేసింది. 

సినిమా టాకీసుల్లోకి చిన్నారులతో వస్తే వారికి కావాల్సిన ఫుడ్​ను బయటి నుంచి తెచ్చుకుంటే మాత్రం అనుమతించాలని, థియేటర్లలో అందరికీ ఉచితంగా శుభ్రమైన మంచినీళ్లను అందించాలని సీజేఐ బెంచ్ పేర్కొంది. ‘‘ప్రేక్షకులు సినిమా చూసేందుకే థియేటర్లకు వస్తారు. బయటి తిండిని అనుమతించాలా? వద్దా? అనేది థియేటర్ ఓనర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బయటి ఫుడ్ పై నిషేధం లేదనుకోండి.. కొందరు జిలేబీలు వంటివి తెచ్చుకుని తింటారు. చేతులను సీట్లకేసి తుడుచుకుంటారు. ఫుడ్ ను అనుమతిస్తే జరిగే వాటికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే..” అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.