మాజీ సీజేఐ చంద్రచూడ్‌ అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించండి: కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ

మాజీ సీజేఐ చంద్రచూడ్‌ అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించండి: కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రస్తుతం నివసిస్తున్న అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. సీజేఐగా చంద్రచూడ్ పదవి కాలం ముగిసి ఆరు నెలలు గడిచిందని.. అయినప్పటికీ ఆయన అధికారిక బ్లంగాలోనే ఉండటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు చంద్రచూడ్ ఉంటున్న అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించాలని లేఖలో కోరింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 

కాగా, మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తుతం ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని 5వ నంబర్ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక నివాసం. 2022 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిబంధనలలోని రూల్ 3B ప్రకారం.. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గరిష్టంగా ఆరు నెలల పాటు అధికారిక నివాసాన్ని కొనసాగించడానికి అనుమతి ఉంది. 

2025, మే 10వ తేదీతోనే చంద్రచూడ్ పదవి విరమణ చేసి 6 నెలలు ముగిసింది. 2025, మే 31, 2025 వరకు అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు గడువు పొడగించారు. ఈ డెడ్ లైన్ కూడా ముగిసింది. కానీ చంద్రచూడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీంతో చంద్రచూడ్ అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. 

అధికారిక నివాసం ఖాళీ చేయడంలో జరిగిన ఆలస్యంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. తన ఇద్దరు కుమార్తెలు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. చికిత్స కొనసాగుతుందని చెప్పారు. అధికారిక బంగ్లా ఖాళీ చేయడంలో జరిగిన జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అధికారులతో చర్చించానని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని చంద్రచూడ్ తెలిపారు.