‘పోక్సో’ విచారణకు స్పెషల్ కోర్టులు

‘పోక్సో’ విచారణకు స్పెషల్ కోర్టులు

చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక దాడులను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన వ్యక్తం చేసింది. పత్రికా కథనాలను సుమోటోగా తీసుకుని చీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. పోక్సో యాక్ట్ అమలు, శిక్షలపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు న్యాయం, దోషులకు శిక్షలు పడేందుకు పెండింగ్ కేసులను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని సూచించింది. దేశంలోని అన్ని జిల్లాల్లో పోక్సో కేసుల విచారణ కోసం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

100 కేసులు పెండింగ్​లో ఉంటే..

100 పోక్సో కేసులు పెండింగులో ఉన్న అన్ని జిల్లాల్లో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. 60 రోజుల్లో కోర్టులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి తమకు సమర్పించాలని ఆదేశించింది. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులకు కావలసిన నిధులు, మౌళిక సదుపాయాలను కేంద్రమే భరించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసులను సీజే  బెంచ్ పరిశీలించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు నమోదైన కేసుల సంఖ్యను చూసి విస్మయం వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా 24,212 కేసులు

దేశవ్యాప్తంగా 24,212 కేసులు నమోదు కాగా, 11,981 కేసుల్లో  పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇందులో 6,449  కేసుల విచారణ జరుగుతోంది. మరో 4,871 కేసుల్లో ఇంకా ట్రయల్స్ ప్రారంభం కాలేదని తెలిసింది.

రాష్ట్రంలో 8,142 కేసులు

రాష్ట్రంలో 2013 నుంచి ఇప్పటి వరకు 8,142 పోక్సో కేసులు నమోదయ్యాయి. 2013లో 281 కేసులు నమోదు కాగా,  వాటి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 2,080 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలోనే 137 కేసులు నమోదయ్యాయి. జూన్ వరకు వెయ్యికిపైగా కేసులు నమోదై ఉండొచ్చని తెలుస్తోంది. ఇక -హైదరాబాద్ లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తంగా 395, -రంగారెడ్డి లో 800లకు పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీస్ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. హైదరాబాద్​లోని లక్డీకాపూల్ లో ఏర్పాటు చేసిన విమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో కేసుల పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. దోషులకు త్వరగా శిక్షలు పడేలా యాక్షన్ తీసుకుంటోంది.

30 మందికి శిక్షలు

హైదరాబాద్​లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు.. పోక్సో కేసుల్లో దోషులకు శిక్షలు ఖరారు చేస్తోంది. గత ఏడాది ఎప్రిల్ నుంచి ఇప్పటిదాకా 395 కేసుల్లో చార్జ్ షీట్లు దాఖలు కాగా, ఈ ఏడాది 30 మందికి శిక్షలు ఖరారు చేసింది. దోషులుగా తేలిన ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మరో 13 మందికి 10 ఏళ్ల జైలు విధించింది.

‘‘సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం. రాష్ట్రంలో రోజూ సగటున ఇద్దరు బాలలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 4 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బాధితులకు అందాల్సిన పరిహారం అందడంలేదు. ట్రయల్ కోర్టులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. సుప్రీం ఆదేశాలతో పోక్సో కేసులకు విచారణ కోసం స్పెషల్ కోర్టులు వస్తాయని ఆశిస్తున్నాం’’

-అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు