సుప్రీంకోర్టులో మార్గదర్శికి షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు ( ఫిబ్రవరి 2) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్ నేరాలకు పాల్పడింది. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏటా రూ.3 వేల 274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలని కోర్టుకు విన్నవించింది.. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదని చెప్పారు.ఏపీ ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీంకోర్టు మార్గదర్శి కేసును తెలంగాణకు బదిలీ చేయాలన్న పిటిషన్ ను కొట్టేసింది.