దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. హైకోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తి.. తీర్పు రిజర్వ్!

దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..  హైకోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తి.. తీర్పు రిజర్వ్!

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ( Darshan )కు సంబంధించిన రేణుకాస్వామి ( Renukaswamy ) హత్యకేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక హైకోర్టు దర్శన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  బెయిల్ మంజూరు చేసిన విధానం ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడింది.  హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన తీరుతో తమకు ఏమాత్రం నమ్మకం లేదని వెల్లడించింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - తీర్పు రిజర్వ్
రేణుకాస్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు 2024 డిసెంబర్ 13న దర్శన్ తో పాటు ఇతర నిందితులకు  బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ( జూలై 24న )  ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు వారం రోజుల్లోగా తమ రాతపూర్వక వాదనలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రేణుకాస్వామి హత్య కేసు
రేణుకాస్వామి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడతో సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రేణుకాస్వామి అనే 33 ఏళ్ల అభిమాని పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా అతడిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు దర్శన్, ఇతరులపై ఆరోపణలున్నాయి. రేణుకాస్వామి మృతదేహం కాలువలో లభ్యమైంది.

►ALSO READ | Bigg Boss 19 : బిగ్ బాస్ 19 సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ లీక్.. ఎన్ని కోట్లంటే?

కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జనవరి 24న దర్శన్, పవిత్రా గౌడ, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను, ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ హత్య కేసులో పక్కా ప్రణాళిక, కుట్ర దాగి ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. హత్యకు ముందు రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో ఎటువంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి