
ఆర్టికల్ 370 పిటిషన్లపై సుప్రీం సీరియస్
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ ఉదయం ప్రారంభించింది. కొన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. సీనియర్ అడ్వొకేట్ ML శర్మ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అసహనం వ్యక్తం చేశారు. “ఏంటీ పిటిషన్.. దీనిపై మేం ఎలా విచారణ జరపాలి.. అసలిది ఎలాంటి పిటిషన్.. పిటిషన్ లో ఏముందో అరగంట పాటు చదివినా అర్థం కావడం లేదు. ఏదీ అర్థం కాకుండా పిటిషన్ లో రాశారు” అని జస్టిస్ రంజన్ గొగొయ్ సీరియస్ అయ్యారు.
జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రానికి మరింత సమయం ఇద్దామని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు.
కశ్మీర్ టైమ్స్ వేసిన పిటిషన్ ను కొట్టేయాలని సొలిసిటర్ జనరల్ వాదించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్నది భద్రతా దళాలకు తెలుసని అన్నారు. కనీసం ల్యాండ్ లైన్లు అయినా పని చేసేలా చూడాలని పిటిషనర్ వాదించారు. మొత్తం వాదనలు విన్న చీఫ్ జస్టిస్ గతంలో చెప్పినట్లే… ప్రభుత్వానికి మరికొంత సమయం ఇద్దామని సూచించారు.