ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన్‌ నియామకాలపై సుప్రీం కోర్టు స్టే.. అసలు వివాదమేంటంటే..?

ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన్‌ నియామకాలపై సుప్రీం కోర్టు స్టే.. అసలు వివాదమేంటంటే..?

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రొఫెసర్​కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన్‌‌ కేసు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. నిరుడు ఆగస్టు 14న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే.. ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని  స్పష్టం చేస్తూ.. విచారణను సెప్టెంబర్​ 17కు వాయిదా వేసింది.  ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ నియామకాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో సివిల్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌(సీఏ) దాఖలు చేశారు. 

తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా కోదండరాం, ఆమిర్​ అలీఖాన్​ను ఎమ్మెల్సీలను గవర్నర్‌‌‌‌ కోటాలో ఎంపిక చేశారని వారు సవాల్‌‌‌‌ చేశారు. ఇదే కేసులో గవర్నర్‌‌‌‌ కార్యాలయం దాసోజు శ్రవణ్​, కుర్రా సత్యానారాయణపై వేర్వేరుగా సివిల్‌‌‌‌ అప్లికేషన్లు (సీఏ) దాఖలు చేసింది. పిటిషన్లపై బుధవారం జస్టిస్‌‌‌‌ విక్రమ్‌‌‌‌ నాథ్, జస్టిస్‌‌‌‌ సందీప్‌‌‌‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిపింది. గవర్నర్‌‌‌‌ కార్యాలయం తరఫున అటార్నీ జనరల్‌‌‌‌ ఆర్‌‌‌‌.వెంకట రమణి, పిటిషనర్లు దాసోజు శ్రవణ్​, కుర్రా సత్యనారాయణ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌ రంజిత్‌‌‌‌ కుమార్, ప్రతివాదులు కోదండరాం, ఆమిర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్లు నిషాంత్‌‌‌‌ శర్మ, రామకష్ణారెడ్డి హాజరయ్యారు. 

తొలుత రంజిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. తామిచ్చే తీర్పుకు తగ్గట్టు ఎమ్మెల్సీల నియామకం ఉంటుందని నిరుడు ఆగస్టు 14న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇదే అవకాశంగా కోదండరాం, ఆమీర్‌‌‌‌ అలీఖాన్​ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారని పేర్కొన్నారు. మధ్యలో జస్టిస్‌‌‌‌ విక్రమ్‌‌‌‌ నాథ్‌‌‌‌ స్పందిస్తూ.. గతంలో తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడమే అవకాశంగా మారినట్టుందని అభిప్రాయడ్డారు. మరోవైపు జస్టిస్‌‌‌‌ సందీప్‌‌‌‌ మెహతా జోక్యం చేసుకొని.. ‘ఆపరేషన్‌‌‌‌ సక్సెస్, పేషెంట్‌‌‌‌ డెడ్‌‌‌‌’గా ఉందని వ్యాఖ్యానించారు.

మేం ఎవరివైపు లేం: గవర్నర్ ఆఫీసు

మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ వ్యవహరిస్తారని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం చేసే సిఫారసులపై స్పందించే స్వేచ్ఛ తమకు ఉందన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఫారసులు చేసిందని, గవర్నర్ ఆ సిఫారసులను ఆమోదించారని వివరించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. తొలి ప్రతిపాదనలు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించింది. అయితే... ‘‘గవర్నర్ ఏ ఒక్క పక్షం వైపు ఉండరు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నరు’’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీల నామినేషన్ రద్దు చేస్తే ఖాళీ ఏర్పడుతుందని అటార్నీ జనరల్ వాదించగా.. గతంలో కూడా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించినప్పుడు ఖాళీలు ఏర్పడలేదా..? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 

అన్ని వైపులా వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. ఏదైనా తుది తీర్పుకు తగ్గట్టు ఉంటుందని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసినందున ఆ ఉత్తర్వులను సవరిస్తున్నట్లు వెల్లడించింది. ఇద్దరిని ఎమ్మెల్సీగా నియమించడంపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్​కాపీలో అన్ని వివరాలు పొందుపరుస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  

ఎమ్మెల్సీల నియామక వివాదం ఇదీ..!

గత బీఆర్ఎస్ సర్కార్ మంత్రివర్గం గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించి గవర్నర్‌‌‌‌కు సిఫారసు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉన్నదంటూ అప్పటి గవర్నర్‌‌‌‌ తమిళిసై ఈ సిఫారసును తిరస్కరిస్తూ.. 2023, సెప్టెంబర్‌‌‌‌ 19న ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాసోజు, కుర్రా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇదే టైంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం... సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మంత్రివర్గం 2024 జనవరి 13న కోదండరాం, ఆమీర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌  పేర్లను గవర్నర్‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ సిఫారసు చేసింది. ఈ సిఫారసును గవర్నర్ ఆమోదించడంతో అదే ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్ చేసింది.

 ఇదిలా ఉండగానే.. దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువైపుల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. గతేడాది మార్చి 17న 73 పేజీలతో కూడిన తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్‌‌‌‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే.. కొత్తగా ఎమ్మెల్సీగా కోదండరాం, అలీఖాన్‎ను నియమించాలనే తీర్మానంతోపాటు వాళ్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఇచ్చిన గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేసింది. ఆ పేర్లను గవర్నర్‌‌‌‌ ఆమోదించడంతో కోదండరాం, అలీఖాన్‌‌‌‌ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. 

గవర్నర్‌‌‌‌ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందంటూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ నిరుడు ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు.. తామిచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుందని ఆగస్టు 14న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తర్వాత కోదండరాం, అలీఖాన్‌‌‌‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయడాన్ని బుధవారం విచారణలో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అందుకే గతంలోని మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది.  

ధర్మం గెలిచింది:- దాసోజు శ్రవణ్

సుదీర్ఘ పోరాటం తర్వాత ధర్మం గెలిచిందని పిటిషనర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రభుత్వాలు, వ్యవస్థలు రాజ్యాంగ బద్ధంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ‘‘తెలంగాణలో రేవంత్ రెడ్డి తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో గవర్నర్  నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అలా ఎందుకు వ్యవహరించారో?! ఎట్టకేలకు.. ధర్మం గెలిచింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ పూర్తిగా వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న ఏం చెప్తుందో చూడాలి’’ అని ఆయన అన్నారు.