అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీం స్టే.. ఆ వ్యాఖ్యలు అమానవీయమన్న కోర్టు

అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీం స్టే.. ఆ వ్యాఖ్యలు అమానవీయమన్న కోర్టు

న్యూఢిల్లీ: మహిళ ఛాతిని తాకడం, డ్రెస్సును లాగడం అత్యాచారయత్నం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘‘ఇది చాలా తీవ్రమైన, సున్నితమైన అంశం. కానీ జడ్జి చేసిన వ్యాఖ్యల్లో సున్నితత్వం లోపించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. సాధారణంగా కేసు ఈ స్టేజ్‌‌లో ఉన్నప్పుడు స్టే విధించేందుకు సమయం తీసుకుంటం. కానీ ఈ కేసులో జడ్జి వ్యాఖ్యల్లోని తీవ్రత దృష్ట్యా వెంటనే స్టే విధిస్తున్నం” అని కోర్టు తెలిపింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు వివాదాస్పదం కావడంతో, దానిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ ప్రారంభించింది.

 ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇది చాలా తీవ్రంగా పరిగణించే తీర్పు” అని పేర్కొన్నారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. జడ్జికి సున్నితత్వం లేదని ఇది తెలియజేస్తున్నది. జడ్జిపై ఇలాంటి పరుష పదాలు వాడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి” అని పేర్కొంది. ఈ విషయంలో చర్యలు తీసుకునేలా అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌కు ఆదేశాలు ఇవ్వాలని మెహతా కోరగా.. ‘‘జడ్జి ఇచ్చిన తీర్పును మేం పరిశీలించాం. అందులో కొన్ని వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. తీర్పును రిజర్వ్ చేసి, 4 నెలల తర్వాత తీర్పు ఇచ్చారు. అంటే జడ్జి తగిన సమయం తీసుకుని తీర్పు రాశారు. దీన్ని బట్టి జడ్జికి ఏమాత్రం సున్నితత్వం లేదని అర్థమవుతున్నది” అని బెంచ్ వ్యాఖ్యానించింది. 

కేంద్రం, యూపీ సర్కార్‌‌‌‌కు నోటీసులు 

దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్టే విషయాన్ని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌కు తెలియజే యాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌ను ఆదేశించిం ది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.