ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హక్కులను తొలగించే ప్రసక్తే లేదు

ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హక్కులను తొలగించే ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక హక్కులను తొలగించే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలతో సహా ఇతర ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనలను టచ్ చేసే ఉద్దేశమే తమకు లేదని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సమాధానమిచ్చారు.

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బెంచ్ పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది. దీనికి అనుబంధంగా మరో పిటిషన్ దాఖలైంది. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దు చేసినట్లే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను తొలగించవచ్చనే ఆందోళనలున్నాయని, కేంద్రం సమాధానం చెప్పాలని ఆ పిటిషన్​లో కోరారు. దీనికి కేంద్రం సమాధానమిచ్చింది.

 ‘‘రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్​లో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన పర్మినెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటిని ముట్టుకునే ఉద్దేశం కేంద్రానికి లేదు. భయాందోళనలు అక్కర్లేదు’’ అని తుషార్ మెహతా చెప్పారు. దీంతో అనుబంధ పిటిషన్​పై విచారణను ముగిస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.