తిరుమల లడ్డూ కల్తీ పై ఇవాళ (ఫిబ్రవరి 23) సుప్రీంలో విచారణ

తిరుమల లడ్డూ కల్తీ పై ఇవాళ  (ఫిబ్రవరి 23) సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల శ్రీవారి‌‌ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గత వైఎస్ఆర్‌‌‌‌సీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై గతంలో సుప్రీంకోర్టు విచారించింది. 

ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ‘సిట్’ ను ఏర్పాటు చేసింది. నెయ్యి కల్తీ జరగడం వాస్తవమేనని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. నెయ్యి టెండర్ల పర్యవేక్షణలో లోపాలు, నిబంధనల సడలింపు వంటి వైఫల్యాల వల్లే కల్తీ జరిగిందని నివేదికలో పేర్కొంది. 

ఈ రిపోర్టును పరిశీలించి, బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై 45 రోజుల్లోగా సిఫార్సులు చేయాలని ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య కమిటీని నియమించింది. అయితే, ఈ ఏకసభ్య కమిటీని వ్యతిరేకిస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, సిట్, సీబీఐ,  టీటీడీని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌‌ను సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.