- గర్భాన్ని కొనసాగించమని ఏ కోర్టు కూడా బలవంతం చేయకూడదని ఆదేశం
న్యూఢిల్లీ: తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించమని ఏ కోర్టు కూడా ఒక మహిళను, ముఖ్యంగా మైనర్‌ను బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏడు నెలల కంటే ఎక్కువ గర్భంతో ఉన్న 15 ఏండ్ల బాలిక తన గర్భాన్ని తొలగించుకోవడానికి (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు, ప్రత్యుత్పత్తికి సంబంధించిన విషయాలలో నిర్ణయాధికారం మహిళకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని కోర్టు పేర్కొంది. గర్భవతి ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆమె రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ కేసులోని 15 ఏండ్ల బాలిక అవాంఛిత గర్భాన్ని మోయడానికి తీవ్రంగా నిరాకరించడమే కాకుండా, ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని కోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించడం కంటే ఆ గర్భవతి అయిన బాలిక మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ గర్భాన్ని కొనసాగించాలని కోర్టు బలవంతం చేస్తే బాధితులు ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. మహిళ పునరుత్పత్తికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ బాలికకు అబార్షన్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

