11 డాక్యుమెంట్లు అనుమతించడం ఓటర్ ఫ్రెండ్లీనే కదా..? సర్‎పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

11 డాక్యుమెంట్లు అనుమతించడం ఓటర్ ఫ్రెండ్లీనే కదా..? సర్‎పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీహార్‌‌‌‌‌‌‌‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ఓటరు గుర్తింపునకు 11 డాక్యుమెంట్లను అనుమతించడం ఓటరు ఫ్రెండ్లీనే అని వ్యాఖ్యానించింది. ‘‘గతంలో  ఓటరు సవరణకు 7 ధ్రువపత్రాలనే అనుమతించారు. ఇప్పుడు ఆ సంఖ్య 11కి పెరిగింది. ఇది ఓటర్‌‌‌‌‌‌‌‌కు అనుకూలమే కదా..?” అని పేర్కొన్నది. ‘సర్’ను సవాల్ చేస్తూ  దాఖలైన పిటిషన్లపై  బుధవారం జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్, జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ కొనసాగించింది. 

బిహార్‌‌‌‌‌‌‌‌లో ఓట్ల సవరణకు ఆధార్‌‌‌‌ మినహా అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నది. ఆధార్‌‌‌‌ అనుమతించడం లేదనే పిటిషనర్ల వాదనను అర్థం చేసుకుంటున్నామని, అయితే, ఇతర  డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటున్న విషయాన్ని పిటిషనర్లు గమనించాలని సూచించింది. వారు 11 డాక్యుమెంట్లనూ చూపించాలని అడిగితే అది యాంటీ ఓటర్ అవుతుందని, కానీ వాటిలో ఏదో ఒకటి చూపిస్తే చాలని అంటున్నారని తెలిపింది. 

అందరికీ అన్ని డాక్యుమెంట్లు ఉండవు: సింఘ్వీ

పిటిషినర్ల తరఫున సీనియర్ లాయర్​అభిషేక్​ మను సింఘ్వీ వాదించారు. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలావరకు ధ్రువపత్రాలు అందరికీ అందుబాటులో ఉండవని బెంచ్​దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్​లేనివారికి ఆప్షన్​5, 6, 7 ఉండవని చెప్పారు. ఆప్షన్​1, 2 ఉనికిలో లేవని, అక్కడ నివాస ధ్రువీకరణ పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇక రాష్ట్రంలో కేవలం 1–2శాతం మందికి మాత్రమే పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లు ఉన్నాయని వివరించారు. 

జస్టిస్ సూర్యకాంత్​ జోక్యం చేసుకొని.. అత్యధిక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌‌‌‌లున్న బిహార్‎ను ఆ విధంగా ప్రొజెక్ట్​ చేయొద్దని సూచించారు. రాష్ట్రంలో 36 లక్షల మంది పాస్‌‌‌‌పోర్టు కలిగి ఉన్నారని, ఇది మంచి సంఖ్యలాగే కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ తీసుకున్న తర్వాతే ధ్రువపత్రాల జాబితా రూపొందిస్తారని జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్య బాగ్చీ పేర్కొన్నారు.