ముందస్తు అనుమతి లేకుండానే.. పెద్దాఫీసర్లనూ విచారించొచ్చు

ముందస్తు అనుమతి లేకుండానే.. పెద్దాఫీసర్లనూ విచారించొచ్చు

న్యూఢిల్లీ: అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జాయింట్‌‌ సెక్రటరీ స్థాయి, ఆపై హోదాల్లోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్ల విషయంలో ముందస్తు అనుమతి లేకుండానే విచారణ, ప్రాసిక్యూట్ చేయవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ ఉత్తర్వులు 2003 సెప్టెంబర్ 11 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. జాయింట్ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు అవినీతి కేసుల్లో ఇమ్యూనిటీ కల్పిస్తూ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌‌మెంట్(డీఎస్‌‌పీఈ) యాక్ట్ 1946లో చేసిన ప్రొవిజన్‌‌ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు 2014లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సమర్థిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.  

ఇదే కేసు కథ

సెక్రటరీ లేదా ఆపై స్థాయి అధికారిని విచారణ లేదా దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలంటూ డీఎస్‌‌పీఈ చట్టంలో సెక్షన్ 6(ఏ)ని 2003 సెప్టెంబర్ 11న చేర్చారు. దీనిపై 2014 మే నెలలో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. చట్టంలోని సెక్షన్ 6ఏ(1) చెల్లదని స్పష్టం చేసింది. సెక్షన్ 6ఏలోని ‘రక్షణ’ అనేది అవినీతిపరులను రక్షించేదిగా ఉందని చెప్పింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప్రకారం వచ్చిన హక్కుల విషయంలో ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందా? అనే అంశంపై 2016 మార్చిలో ఇద్దరు జడ్జిల బెంచ్.. రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తాజాగా తీర్పు చెప్పింది. డీఎస్‌‌పీఈ చట్టంలో సెక్షన్ 6(ఏ) అనేది 2003 సెప్టెంబర్ 11 నుంచే అమల్లో ఉండదని స్పష్టం చేసింది.