ఇంటర్నెట్ సర్చ్ చేశారు..  సాక్ష్యాలు లేకుండా హత్య చేయాలనుకున్నారు.. సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

ఇంటర్నెట్ సర్చ్ చేశారు..  సాక్ష్యాలు లేకుండా హత్య చేయాలనుకున్నారు.. సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  • సాక్ష్యాలు దొరక్కుండా హత్య ఎలా?
  •  ప్రియుడిని చంపిన తల్లీకొడుకులు

జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో వేధిస్తున్న ప్రియుడిని ఓ మహిళ తన కొడుకుతో కలిసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి పదేండ్లుగా అరుణ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అరుణ కొడుకు సాయిరత్నంతో కలిసి వీరు పదేండ్లుగా షాపూర్​నగర్, చింతల్ ప్రాంతాల్లో నివసిస్తూ, పది నెలల కింద సూరారంలోని చెరుకుపల్లి కాలనీకి మారారు. 

శివారెడ్డి ప్రతిరోజూ మద్యం తాగొచ్చి అరుణను, ఆమె కొడుకును తీవ్రంగా వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక అతడిని చంపాలని నిర్ణయించుకున్న తల్లీకొడుకులు.. సాక్ష్యాలు దొరక్కుండా హత్య చేయడం ఎలాగో ఇంటర్నెట్​లో సెర్చ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం మటన్ కట్ చేసే కత్తిని కొనుగోలు చేశారు. ఈ నెల 3న అర్ధరాత్రి శివారెడ్డి మద్యం తాగి గొడవపడి నిద్రపోగా.. మెడపై కత్తితో నరికి హత్య చేశారు. 

హత్య అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు గదిలోని రక్తాన్ని శుభ్రం చేసి, రక్తంతో తడిసిన బట్టలను కాలువలో పడేశారు. శవాన్ని సంచిలో మూటకట్టి పారేయాలని ప్లాన్ చేస్తుండగా.. గదిలోంచి అరుపులు విన్న స్థానికులు ఇంటి యజమాని కృష్ణకు ఫోన్ చేశారు. ఆయన వచ్చి చూడటంతో రక్తం మరకలు, శవం ఉన్న సంచి బయటపడ్డాయి. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అరుణ, సాయిరత్నంను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.