ఆడపడుచు కండ్లలో ఆనందం కోసమే...ఆరునెలల చిన్నారి కిడ్నాప్..సూరారం కేసును ఛేదించిన పోలీసులు

ఆడపడుచు కండ్లలో ఆనందం కోసమే...ఆరునెలల చిన్నారి కిడ్నాప్..సూరారం కేసును ఛేదించిన పోలీసులు
  • క్యాటరింగ్ పనులు చేస్తూ కిడ్నాప్​కు స్కెచ్ చేసిన మహిళ
  • ఇద్దరు మైనర్లతో సహా  మొత్తం ఐదుగురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: సూరారంలో ఆరు నెలల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆడపడుచు కండ్లలో ఆనందం కోసమే చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ కేసు వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి బుధవారం వెల్లడించారు. కర్నాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శ్రీదేవి (35) అనే మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి మైలార్​దేవ్​పల్లిలో క్యాటరింగ్ పనులు చేస్తోంది.

బీదర్​లో ఉండే తన ఆడపడచుకు పిల్లలు లేకపోవడంతో ఎలాగైనా ఒక పాపను ఎత్తుకెళ్లి ఆమెకు ఇవ్వాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం తనతోపాటు పనిచేసే కార్తీక్, జాన్సన్, మరో ఇద్దరు మైనర్లతో కలిసి  ఓ పాపను ఎడ్కడినుంచైనా కిడ్నాప్​చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద అందరూ కలిసి రిక్కీ నిర్వహించారు.

రోడ్డు పక్కన నివసించే నవనీత అనే మహిళకు నలుగురు ఆడ పిల్లలు ఉన్నారని, వారిలో చిన్నపాపను ఎత్తుకెళ్తే ఎవరికీ అనుమానం రాదని భావించారు. ఈ నెల 3న అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఆరు నెలల పాపను బైక్​పై వచ్చి కిడ్నాప్ చేశారు. పాప పెద్దక్క అరవడంతో తల్లి లేచి చూసేలోపే నిందితులు పారిపోయారు.

బాధితుల ఫిర్యాదుతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో నిందితులను వెంబడించి.. ఈ నెల 5న రాత్రి పాపను బీదర్​కు తరలిస్తుండగా రాజేంద్రనగర్ పిల్లర్ నంబర్ 212 వద్ద పట్టుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

కేసును వేగంగా ఛేదించిన అధికారులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి పర్యవేక్షణలో పనిచేసిన సూరారం సీఐ సుధీర్ కృష్ణ, దుండిగల్ డీఐ బాలరెడ్డి, ఎస్వోటీ సీఐ శ్యాంసుందర్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ దాలి నాయుడు, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.