పరిచయం : లెక్చరర్ అవ్వాలనుకున్నా కానీ..

పరిచయం : లెక్చరర్ అవ్వాలనుకున్నా కానీ..

హిందీ డబ్బింగ్ సీరియల్ అయినప్పటికీ ‘నాగిన్(నాగిని)’ని​ తెలుగు ప్రేక్షకులు దాన్ని బాగా ఆదరించారు. దాంతో సీజన్​ల మీద సీజన్​లు తీశారు. రెండు సీజన్ల వరకు నాగిని పాత్రలో మౌనీ రాయ్ నటించింది. మూడో సీజన్​కి కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. దాంతో ‘బాగుందని, బాగొలేదని’ రకరకాల కామెంట్స్​ చేశారు. ఇప్పుడు నాగిని క్యారెక్టర్​ చేస్తున్న ఆమె పేరు సురభి జ్యోతి. రెండు సీరియల్స్​తో స్టార్​డమ్ తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి లేటెస్ట్​గా ‘గునాహ్’ అనే సిరీస్​తో ఓటీటీ ఆడియెన్స్​ని పలకరించింది. ఆమె జర్నీ గురించి...

‘‘మా ఊరు పంజాబ్​లోని జలంధర్​. నాన్న బిజినెస్ మ్యాన్. జలంధర్​లోని ‘శివ్​ జ్యోతి’ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా. తర్వాత ‘హన్స్ రాజ్​ మహిళ మహా విద్యాలయా’లో కాలేజీ చదువు పూర్తి చేశా. పీహెచ్​డీ చేసే టైంలో యాక్టింగ్ ఛాన్స్​ వచ్చింది. స్కూల్​, కాలేజీల్లో చదువుకునేటప్పుడు నాకు ‘చదువు’ గురించి మాత్రమే తెలుసు. యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​, ఇంగ్లిష్​ లిటరేచర్​లలో రెండు మాస్టర్ డిగ్రీలు చేశా. పీహెచ్​డీ మొదలుపెట్టినప్పుడు లెక్చరర్​ అవ్వాలి అనుకున్నా. మధ్య మధ్యలో థియేటర్ ఆర్టిస్ట్​గా ఉన్నా. కొన్నాళ్లు ఆర్జేగా కూడా పనిచేశా. మ్యూజిక్​ వీడియోల్లో నటించా. ఆ టైంలో పంజాబీలో ‘ఇక్​ కుడీ పంజాబీ ది’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తర్వాత వరుసగా పంజాబీ సినిమాలు, సీరియల్స్​లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు కూడా యాక్టింగ్​ని ప్రొఫెషన్​గా తీసుకుంటా అనుకోలేదు. 

అందుకే ఒప్పుకున్నా

జీ ఛానెల్లో  ‘ఖుబూల్ హై’ (2012–2016) అనే సీరియల్​లో మెయిన్​ లీడ్​గా చేయడం డెబ్యూ. దానికి ముందు ‘అఖియా తో దూర్​ జాయేనా’, ‘కచ్​ దియా వంగ’ అనే పంజాబీ సీరియల్స్​లో చేశా. ఖుబూల్ హైతో వర్సటైల్ యాక్ట్రెస్​గా పేరొచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్ చేసే ఛాన్స్​ వచ్చింది. వాటిలో ‘నాగిని 3’ చాలా పాపులర్. టీఆర్​పీలో ఎప్పుడూ టాప్​లో ఉండే షో అది. ఆ సీరియల్ ఒప్పుకున్నప్పుడు కన్విన్స్ అవడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అప్పటివరకు రియలిస్టిక్ పాత్రలే చేశా. నాగిని3లో ఫిక్షనల్ రోల్. బాలాజీ ప్రొడక్షన్స్, కలర్స్ ఛానెల్​ నెంబర్ 1 పొజిషన్​లో ఉన్నాయి. అందుకే అలాంటి వాళ్లతో పనిచేసే అవకాశం రావడం మంచి ఛాన్స్​. అందుకే ఆ రోల్​ చేసేందుకు ఒప్పుకున్నా.

అన్నీ తెలిసే వచ్చా

నేను యాక్టింగ్ మొదలుపెట్టినప్పుడు నా వయసు19 ఏండ్లు. వయసు తక్కువే అయినప్పటికీ నేను వెళ్తున్న ఫీల్డ్​ ఏంటి? అక్కడ నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే వాటి మీద నాకు అవగాహన ఉంది. ఇండస్ట్రీ నన్ను బాగానే ఆహ్వానించింది. కానీ, కొత్త కావడం వల్ల ఒత్తిడి తట్టుకోలేకపోయా. ఆ  ఒత్తిడి కూడా సక్సెస్​ లేక కాదు... సక్సెస్​ వల్ల. కొన్నిసార్లు ఆలోచించుకునేందుకు కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు బయటినుంచి చూసేవాళ్లు ‘‘ నార్మల్ బట్టలు ఎలా వేసుకుంటావు? ఆటోలో ఎలా ట్రావెల్ చేస్తావు?’’ అని అడుగుతుంటారు. ఒకసారి నేను మా అమ్మతో ఫోన్​లో మాట్లాడుతున్నా. అప్పుడు నన్ను గమనించిన కొందరు ఫ్యాన్స్​ దగ్గరకొచ్చి పెద్దగా అరిచారు. ఇలాంటి సందర్భాల్లో ‘నేను ఫోన్​లో ఉన్నానని కనిపించట్లేదా?’ అని గట్టిగా చెప్పాలి అనుకుంటా. ‘నేను ఒక మనిషినే. ఎప్పుడూ యాక్టర్​లా ఉండలేను’ అని వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ, చేయలేను. ఎందుకంటే యాక్టర్​కి అదే వెలకట్టలేని బహుమానం. బ్లెస్సింగ్​ అనుకోవాలి అని నాకు నేనే సర్ది చెప్పుకుంటా. 

టర్నింగ్ పాయింట్ అదే

‘ఖుబూల్​ హై...’ సీరియల్ టీంకి నా ఫొటోలు నచ్చి ఆడిషన్​కి పిలిచారు. అక్కడ సెలక్ట్​ అయ్యి నటన కెరీర్​గా తీసుకున్న తర్వాత నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. మొదటి సీరియల్​ నాకు బ్రేక్ ఇచ్చింది.  అందులో నా పాత్ర పేరు జోయా ఫరూఖీ. ఆ తరువాత చాలా సీరియల్స్​లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చా. 2013 నుంచి 2015 వరకు ఆ రెండు సంవత్సరాల్లో11 సీరియల్స్​లో ‘జోయా ఫరూఖీ’ క్యారెక్టర్​ను గెస్ట్​ రోల్​గా చేశా. నా కెరీర్​లోనే ఖుబూల్​ హై చాలా పెద్ద టర్నింగ్ పాయింట్​. ఒక రాత్రికిరాత్రి హిట్ అయిన నా ఫస్ట్ షో అది.

దానికోసం మూడేండ్లు కష్టపడ్డాం. ఆ సీరియల్​ పూర్తయ్యే టైంకి స్టార్​గా పేరొచ్చింది. అర్బన్​, ప్రొగ్రెసివ్​ షో అయిన ఆ సీరియల్ నా లైఫ్​ మొత్తం మార్చేసింది. దాని తర్వాత ‘నాగిన్’​తో మళ్లీ మాస్​ షో చేసే అవకాశం దక్కింది. నేను చేసింది కొన్నే అయినా గుర్తింపు మాత్రం వెంటనే వచ్చింది. ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఖుబూల్ హై మోడర్న్​​ స్టోరీ కాబట్టి అర్బన్​ క్లాస్​కి దగ్గరయ్యా. ‘నాగిన్’​తో మాస్ ఆడియెన్స్​కు చేరువయ్యా. నాగిన్​ చాలా ఛాలెంజింగ్​ రోల్. నేను దాన్ని చేయగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్​లో బెంచ్ మార్క్ సెట్ చేసింది.

అలాగే ఖుబూల్​ హైలో చేసిన క్యారెక్టర్​ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఖుబూల్ హై 2.0గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ మొదటిసారి యాక్టర్​ కరణ్​తో కలిసి పనిచేశా. ఇద్దరం ఎనిమిదేళ్లుగా తెలిసిన వాళ్లం. టామ్​ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటాం. కానీ మా ఇద్దరి మధ్యా అండర్​స్టాండింగ్​ ఉంది. చాలా కంఫర్ట్​బుల్​గా నటించగలుగుతాం.

ఆ గ్యాప్ ఎందుకో మరి

టీవీ, ఫిల్మ్ యాక్టర్స్​కి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. కానీ ఆ గ్యాప్ ఎందుకు ఉందో నిజంగా అర్థం కాలేదు నాకు. టెలివిజన్​ సక్సెస్​ రేట్ చూస్తే సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది. పది సినిమాలు ఉంటే వాటిలో సక్సెస్ రేట్ పదిశాతమే. అదే పది టెలివిజన్​ షోలు ఉంటే, సక్సెస్ రేట్ 80 శాతం ఉంటుంది. అందరూ బయటకు వెళ్లి సినిమాలు చూడరు. అదే టీవీ సీరియల్స్ అయితే ఇంట్లో కూర్చుని ప్రతి ఒక్కరూ చూస్తారు.

అలా చూసుకుంటే ఫిల్మ్ యాక్టర్స్ కంటే టీవీ యాక్టర్స్ రీచ్ ఎక్కువ. అలాంటిది బుల్లితెరను​చిన్నచూపు చూడడం సరికాదు. ఓటీటీ వచ్చాక నటీనటులకు న్యాయం జరిగిందని చెప్పొచ్చు. అందులో అయితే ఫిల్మ్​, టీవీ యాక్టర్స్ అనే తేడా ఉండదు. ఆ క్యారెక్టర్​కి ఏ యాక్టర్​ సరిపడతారో చూసి అవకాశం ఇస్తారు. సినిమా లేదా టీవీ నటులా అనేది చూడరు.

సొసైటీ ఎలా ఉందంటే..

సొసైటీలో చాలా విషయాలను జడ్జ్ చేస్తుంటారు. నటన అనేది కూడా ఒక పనే. కానీ, కొందరు దాన్ని రాంగ్ ప్రొఫెషన్​గా చూస్తుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు యాక్టింగ్ ఫీల్డ్​లో చేయడం మంచిది కాదనుకుంటారు ఎక్కువమంది. అలా ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. ఆ విషయంలో నేను లక్కీ. నన్నెవరూ జడ్జ్ చేయలేదు. నటిస్తానంటే నా పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. మా అమ్మానాన్నలకు  యాక్టింగ్ రంగం గురించి అవగాహన ఉంది.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే.. సక్సెస్ త్వరగా వస్తే కొందరు సహ నటులు అస్సలు జీర్జించుకోలేరు. ‘‘తక్కువ డబ్బులు ఇవ్వొచ్చని కొత్త అమ్మాయిలను తీసుకొస్తున్నారు. వాళ్లకు టాలెంట్ లేదు’’ అనే కామెంట్స్ చేస్తారు. నేను అలాంటి కామెంట్స్​ను, అలాంటి వాళ్లను పట్టించుకోను. అలా పట్టించుకోవడం మానేస్తే జర్నీ చాలా సాఫ్ట్​గా ముందుకు సాగుతుంది.

గునాహ గురించి..

ఇప్పటివరకు చేసిన సినిమాలు, సీరియల్స్​లో హీరోయిన్ పాత్రలే చేశా. వెబ్​ సిరీస్​ ‘గునాహ్’​లో హీరో, విలన్​ పాత్రల్లానే హీరోయిన్​ పాత్రకు కూడా వెయిట్ ఉంది. ఇది చాలా భిన్నమైన పాత్ర. 

*    రియాలిటీ షోల్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటా. పలు రకాల పాత్రల్లో నటించా.  ఏ క్యారెక్టర్ అయినా వంద శాతం ఇవ్వడానికి ట్రై చేస్తా. అంతెందుకు ఒక పాత్ర చేయడం కోసం పళ్లకు క్లిప్ పెట్టించుకున్నా. 

*    మ్యూజిక్ వీడియోలు 2018లో మొదలుపెట్టా. ఆ తర్వాత ఒక ఏడాది గ్యాప్ వచ్చింది. కానీ, 2022 వరకు దాదాపు పది మ్యూజిక్ వీడియోల్లో నటించా.

*    నేను అనుకున్న దాన్ని సాధించేవరకు వదిలిపెట్టను. నా వ్యక్తిగత జీవితం గురించి పర్సనల్  షేర్ చేసుకోవడం నాకు నచ్చదు. యాక్ట్రెస్​, పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన నా పర్సనల్ లైఫ్​ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు!