- కీలకంగా మారుతున్న బాధితుల వాంగ్మూలం
- డీఎన్‌ఏ రిపోర్టులు, డిజిటల్, సైంటిఫిక్ ఆధారాలతో నేర నిరూపణ
- రాష్ట్రంలోని 36 పోక్సో స్పెషల్ కోర్టుల్లో జెట్స్పీడ్తో విచారణ
- ఏడాది లోగా న్యాయ విచారణ పూర్తి , దోషులకు శిక్షలు
- రాష్ట్రంలో గతేడాది 20.21 శాతం పెరిగిన కన్విక్షన్ రేట్
హైదరాబాద్, వెలుగు: మైనర్లపై లైంగిక దాడులు, అసభ్యంగా ప్రవర్తించిన కేసుల్లో పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. పోక్సో కేసుల దర్యాప్తులో బాధితురాలి వాంగ్మూలం సహా పూర్తిగా డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నారు. వీటితో పాటు డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింట్స్ సహా సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు అందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా.. పోక్సో యాక్ట్ ప్రకారం దోషులకు కఠిన శిక్షలు పడేలా నేరాన్ని నిరూపిస్తున్నారు. సాధారణంగా ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ (పోక్సో) 2012, సెక్షన్ 35 ప్రకారం, స్పెషల్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకున్న నాటి నుంచి ఏడాది లోపు ట్రయల్ పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి ఆధారాలను గడువులోగా కోర్టుకు
అందిస్తున్నారు.
36 పోక్సో స్పెషల్ కోర్టులు, ఏడాదిలోగా విచారణ పూర్తి
పోక్సో కేసుల విచారణ కోసం రాష్ట్రంలో 36 స్పెషల్ కోర్టులు పనిచేస్తుండడంతో విచారణ వేగవంతంగా జరుగుతోంది. బాధితురాలు సహా దర్యాప్తు అధికారులు, సాక్షుల వాంగ్మూలాలను నిర్దేశించిన సమయంలోనే కోర్టులు రికార్డ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్షకాలకు అనుగుణంగా తీర్పులు వెల్లడిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు కోర్టు విచారణలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
వీటితో పాటు డీఎన్‌ఏ టెస్టులు, డిజిటల్ ఆధారాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. ప్రధానంగా బాధితురాలి వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకుని దోషులను గుర్తిస్తున్నాయి. బాలికలపై లైంగిక దాడి నిరూపితం అయిన కేసుల్లో దోషులకు 20 ఏండ్లకు తగ్గకుండా శిక్షలు విధిస్తున్నాయి. ఇలా ట్రయల్ పూర్తైన 49 కేసుల్లో గతేడాది పోక్సో కోర్టులు తీర్పులు వెల్లడించాయి. 43 మందికి 20 ఏండ్ల చొప్పున జైలు శిక్షలు విధించగా మరొకరి 30 ఏండ్లు, నలుగురికి 25 ఏండ్లు కఠిన కారాగార శిక్షలు విధించాయి.
మూడేండ్లతో పోల్చితే 13 శాతం అధికం
గతేడాది కన్విక్షన్ రేట్20.21 శాతం నమోదైంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 36 పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ ఏడాది జూన్ చివరి నాటికి 8,806 పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లోను నిర్ణీత గడువులోగా తీర్పులు వెలువడే విధంగా రాష్ట్ర ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్ కృషి చేస్తోంది. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసులు, శిక్షలకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో తెలంగాణలో 2023లో 17.21 శాతం కన్విక్షన్(నేర నిర్ధారణ) నమోదు కాగా, 2024లో 17, గతేడాది ఏకంగా 20.21 శాతం కన్విక్షన్ అయినట్టు తెలిపింది. కాగా, రాష్ట్రంలో 8,806 కేసులు పెండింగ్‌లో ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 218 కోర్టుల్లో 98,359 పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 2.56 లక్షల పోక్సో కేసులు పెండింగ్
పోక్సో కేసుల విచారణ కోసం 2019 అక్టోబర్‌లో పోక్సో స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కోర్టులు పోక్సో చట్టం కింద ఉన్న నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసులను కాలపరిమితిలోగా విచారించి, పరిష్కరించడానికి ఏర్పాటు చేశారు. ఈ మేరకు దేశంలోని హైకోర్టులు అందించిన సమాచారం ప్రకారం, జూన్ 30, 2026 నాటికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి దేశ వ్యాప్తంగా 779 పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌స్పెషల్ కోర్టులు పనిచేస్తున్నాయి.
వీటిలో 2,56,097 కేసులు విచారణలో పెండింగ్‌లో ఉన్నాయి. నల్గొండలో పదకొండేండ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. బాలిక వాంగ్మూలం వీడియో రికార్డింగ్ చేశారు. సాక్షులు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోర్టుకు అందించారు. పోలీసులు అందించిన సాక్ష్యాల ఆధారంగా పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడు మహమ్మద్ ముక్రంను దోషిగా తేల్చారు. మరణశిక్ష విధిస్తూ గతేడాది తీర్పు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాలో బాలిక కిడ్నాప్, లైంగిక దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలం సహా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలతో కోహీర్ మండలం గురజాడకు చెందిన తలారి లక్ష్మీనారాయణ (20)ను కోర్టు దోషిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు గతేడాడి తీర్పు వెల్లడించింది.
