
వాషింగ్టన్: మూడేళ్లుగా సాగుతోన్న రష్యాఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా అమెరికా, ఉక్రెయిన్ దేశ అధ్యక్షులతో చర్చలు జరుపుతున్నారు. మొదట రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో భేటీ అయిన ట్రంప్.. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశమయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడమే ట్రంప్ వరుస భేటీలు నిర్వహిస్తున్న వేళ.. ఉక్రెయిన్ రష్యా యుద్ధ చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం గురించి నేరుగా జెలెన్ స్కీతో చర్చలు జరిపేందుకు పుతిన్ అంగీకరించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో మాట్లాడుతూ.. యుద్ధం గురించి చర్చించేందుకు జెలెన్స్కీని కలవడానికి పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో ఇదొక కీలక ముందడుగని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్రంప్, పుతిన్ భేటీలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని పుతిన్ ను ట్రంప్ కోరగా.. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించారని తెలిపారు. యుద్ధం మొదలైన మూడున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పుతిన్, జెలెన్ స్కీ డైరెక్ట్ భేటీ కాలేదని గుర్తు చేశారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరపడమే అంతిమ లక్ష్యంగా ట్రంప్, పుతిన్, జెలెన్స్కీల మధ్య భేటీ జరుగుతుందని.. ఈ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మార్కో రూబియో.
ఇరుపక్షాల్లో ఎవరూ తక్షణ శాంతి ఒప్పందాన్ని ఆశించనప్పటికీ.. యుద్ధం ముగింపుకు చర్చలే కీలకమైన మలుపుగా మారుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పుతిన్, జెలెన్ స్కీలతో భేటీ అయిన ట్రంప్.. త్వరలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మార్కో రూబియో మాటలను భట్టి స్పష్టమైంది.