ఢాకా: ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణభేరి మోగించింది. తను రెండు గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటగా.. ఇండియా మూడు స్వర్ణాలు, రెండు రజతాలు అందుకుంది. గురువారం జరిగిన కాంపౌండ్ ఫైనల్స్‌లో తన గురితో మెప్పించిన జ్యోతి వ్యక్తిగత, టీమ్ టైటిల్స్ అందుకుంది. తొలుత జ్యోతి, దీప్షిక, ప్రతీక ప్రదీప్‌తో కూడిన ఇండియా టీమ్ విమెన్స్ ఫైనల్లో 236–234తో కొరియా జట్టును ఓడించింది.
ఆ తర్వాత విమెన్స్ కాంపౌండ్ ఫైనల్లో 29 ఏండ్ల సురేఖ 147–146తో తోటి ఆర్చర్, 17 ఏండ్ల ప్రతీకను ఓడించి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఇక, మిక్స్‌డ్ టీమ్ తుదిపోరులో దీప్షిక–అభిషేక్ వర్మ ద్వయం 153–151తో బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఇండియాకు మూడో స్వర్ణం అందించింది. అయితే, మెన్స్ టీమ్ మాత్రం తడబడింది. అభిషేక్ వర్మ, సాహిల్ రాజేశ్ జాదవ్, ప్రథమేశ్ ఫుగెతో కూడిన జట్టు ఫైనల్లో 229–230తో కజకిస్తాన్ టీమ్ చేతిలో ఒక్క పాయింట్ తేడాతో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది.
