
- రూ.217 కోట్ల ఆదాయం
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో వైన్స్ షాప్ లకు చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 243 వైన్స్ షాప్ లకు శనివారం రాత్రి 9 గంటల వరకు 7,242 దరఖాస్తులు అందాయి. తద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.217 కోట్ల ఆదాయం సమకూరింది. రాత్రి 9 గంటల తర్వాత కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో వైన్స్ షాపుల దరఖాస్తుల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేకపోయినప్పటికీ చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగింది. గతంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు రాలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 101 వైన్ షాపులు ఉండగా శనివారం రాత్రి వరకు 3,420 అప్లికేషన్లు అందాయి.
తద్వారా రూ.102 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో వైన్ షాపుల కోసం జిల్లా నుంచి దాదాపు 7 వేల దరఖాస్తులు రాగా అందులో ఈసారి సగం కూడా రాకపోయేసరికి ఎక్సైజ్ శాఖలో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉండే పటాన్ చెరు, సంగారెడ్డి సర్కిళ్ల పరిధిలో 37 షాపులకు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఒక్కో దుకాణానికి 40 నుంచి 50 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో ఈసారి వైన్ షాప్ లకు ఆశించిన విధంగా దరఖాస్తులు రాలేదు. మొత్తం 93 వైన్స్ షాపులకు 2,540 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తద్వారా రూ.76 కోట్ల ఆదాయం వచ్చింది. రెండేళ్ల కింద ఇవే షాపులకు 4,166 దరఖాస్తులు రాగా అప్పుడు రూ.88 కోట్ల ఆదాయం రాగా ఈ సారి తగ్గడం గమనార్హం.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో 49 వైన్స్ షాప్ లు ఉండగా శనివారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 1,302 దరఖాస్తులు వచ్చాయి. అందులో 981 దరఖాస్తులు పురుషులు, 321 దరఖాస్తులు మహిళలు దాఖలు చేశారు. దరఖాస్తు ఫీజు రూపంలో రూ.39 కోట్ల ఆదాయం సమకూరింది. కొల్చారం మండలం పోతంశెట్ పల్లి వైన్స్ షాప్ కు అత్యధికంగా 52 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ సారి రూ.3 లక్షలకు పెంచడం వల్ల ఆదాయం గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది.