చైనాకు ప్రధాని మోడీ లొంగిపోయారు

చైనాకు ప్రధాని మోడీ లొంగిపోయారు

ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల విమర్శలు
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో ఇండియా‌‌–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై మౌనంగా ఉన్నారంటూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, మన సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని అఖిలపక్ష సమావేశంలో మోడీ స్పష్టం చేశారు. దీంతో తాజాగా ఈ వ్యాఖ్యలపై మోడీని టార్గెట్‌ చేసుకొని ప్రతిపక్ష నాయకులు మరోసారి విమర్శలకు దిగారు. లడాఖ్‌లో చైనా సైన్యాలు దిగలేదని చెప్పడం ద్వారా చైనాకు మోడీ లొంగిపోయారని, ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.‘ చైనా దూకుడుకు భయపడి ఇండియా భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి అప్పగించారు. ఒకవేళ ఆ భూభాగం చైనాది అయితే మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? వాళ్లు ఎక్కడ చంపబడ్డారు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం కూడా స్పందించారు.

‘లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఎలాంటి చొరబాటు లేదా ఉల్లంఘన జరగకపోతే ఇరు వైపున దళాలు వెనక్కి మళ్లాలని ఎందుకన్ని చర్చలు జరిగాయి? చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారా? ఒకవేళ అదే నిజమైతే.. డ్రాగన్ కంట్రీతో ఇంక మాట్లాడటానికి ఏముంటుంది? మేజర జనరల్స్ అసలు దేని గురించి, ఎందుకు చర్చలు జరుపుతున్నారు? ఇండియా భూభాగంలో ఏ విదేశీయులూ (చైనీయులు) లేరని ప్రధాని అంటున్నారు. అదే నిజమైతే, మే 5–6 తేదీల్లో జరిగిందేంటి? ఈ నెల 16–17 తేదీల్లో దళాల మధ్య ఫైట్ ఎందుకు జరిగింది? ఇండియా 20 ప్రాణాలను ఎందుకు కోల్పోయింది’ అని చిదంబరం ప్రశ్నలు సంధించారు.