
- స్పెషల్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
- రెచ్చగొట్టే కామెంట్స్, కంటెంట్ పరిశీలన
- మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై సైబర్ క్రైమ్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల వేళ సోషల్‌మీడియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలను ప్రభావితం చేసే, ప్రలోభాలకు సంబంధించి విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు స్పెషల్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌పోలీసులతో పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్స్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. వీటి పర్యవేక్షణ కోసం ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్‌లో స్పెషల్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేశారు.
తీవ్రతను బట్టి ఐటీ చట్టం కింద కేసు
బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వరుస బహిరంగ సభలు, ర్యాలీల నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా అన్ని పార్టీల నేతలపై సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్, నాయకులపై వ్యక్తిగత కామెంట్స్, అసభ్యకరమైన కార్టూన్స్, ఎన్నికల ప్రచారంతో సంబంధం లేకుండా రాస్తున్న కంటెంట్ ను గుర్తిస్తున్నారు. వీటి తీవ్రతను బట్టి ఐటీ చట్టం ప్రకారం.. సుమోటొ కేసులు నమోదు చేస్తున్నారు. స్థానిక పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
పొలిటికల్ గ్రూపులపై..
ప్రధానంగా రాజకీయ పార్టీల గ్రూప్స్‌లో జరుగుతున్న ప్రచారాలపై నిఘా పెట్టారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించే పార్టీల నాయకులను గుర్తిస్తున్నారు. ఇందుకోసం సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేవిధంగా గిఫ్ట్‌ల పేరుతో బల్క్‌మెసేజ్‌లు, మద్యం, డబ్బు పంపిణీకి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో స్థానిక పోలీసులతో నిఘా పెట్టారు. ముఖ్యంగా మీడియా గ్రూప్స్‌లో వచ్చే పోస్టింగ్స్‌ను కలెక్ట్ చేస్తున్నారు. వీటిని సంబంధిత ఎమ్‌సీసీ అధికారులకు అందిస్తున్నారు.