3 రోజులు ఆఫీస్.. రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోం

V6 Velugu Posted on Oct 20, 2021

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని ఐటీ సెక్టార్ లో ఇంకా హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానమే కొనసాగుతోంది. ఎంప్లాయీస్ వారంలో 3 రోజులు ఆఫీసుకు వెళ్తూ.. రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.  సిటీలో   2 వేల నుంచి 3 వేల వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయి. వీటిలో చాలావరకు చిన్న ఐటీ కంపెనీలు, మిగతావి ఎంఎన్ సీలు. వీటన్నింటిలో మొత్తం ఆరున్నర లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నరగా ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోంలోనే ఉన్నారు. ప్రస్తుతం కొవిడ్​తీవ్రత తగ్గి అంతా నార్మల్ గా మారుతుండటంతో ఎంప్లాయీస్ ను దశలవారీగా ఆఫీసలకు పిలిపించేందుకు కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఆఫీసుకు వచ్చే ఎంప్లాయీస్​సంఖ్యను క్రమక్రమంగా పెంచుతూ పూర్తిస్థాయిలో కంపెనీలను ఓపెన్ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికీ పలు ఎంఎన్ సీలలో 20 నుంచి 25 శాతం ఎంప్లాయీస్ మాత్రమే డైరెక్ట్ గా ఆఫీసులకు వెళ్తున్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోంలోనే ఉన్నారు. కంపెనీలు సైతం రిస్క్ తీసుకోకుండా ఆఫీసుకు రావడం లేక వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ను  ఎంప్లాయీస్​ఇష్టానికే వదిలేస్తున్నాయి. కానీ కొన్ని చిన్న కంపెనీలు, స్టార్టప్ లు మాత్రం ఎంప్లాయీస్​ కచ్చితంగా ఆఫీసులకు రావాలని చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం చిన్న కంపెనీల్లో ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్న వారు 60 నుంచి 70 శాతంపైనే ఉన్నారు. మరోవైపు గ్రేటర్ లోని ఐటీ ఎంప్లాయీస్​లో ఎక్కువ మంది సెకండ్ డోస్ తీసుకోలేదని అందుకే వర్క్ ఫ్రమ్ హోం విధానమే నడుస్తోందని ఐటీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ ఫోరమ్ ఫౌండర్ శ్రీధర్ తెలిపారు.

హైసియా సర్వే ప్రకారం..

కరోనాకు ముందు ఉన్న పని పరిస్థితులనే మెజార్టీ కంపెనీలు కోరుకుంటున్నాయని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) చెబుతోంది. కంపెనీల మేనేజ్ మెంట్లు, ఎంప్లాయీస్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైసియా ఈ ఏడాది ఆగస్టులో ఓ సర్వే కండక్ట్ చేసింది. ఇందులో 33 శాతం కంపెనీలు ఈ ఏడాది చివరిలోగా తమ ఎంప్లాయీస్​అందరితో ఆఫీసుల నుంచే పనిచేయించాలని చూస్తున్నట్లు తెలిపాయి. 41 శాతం కంపెనీలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా ఎంప్లాయీస్ ను ఆఫీసులకు పిలిపించే అవకాశాలున్నాయి. 3 శాతం కంపెనీలు ఈ డిసెంబర్​ నాటికి 10 నుంచి 50 శాతం ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తున్నాయి. మిగిలిన 27 శాతం కంపెనీలు ఈ ఏడాది 10 శాతం ఎంప్లాయీస్​తో మాత్రమే ఆఫీసులో పనిచేయిస్తామని చెప్పాయి. తమ సర్వే ప్రకారం దాదాపు 78 శాతం కంపెనీలు కరోనా ఉన్నా లేకపోయినా హైబ్రిడ్ మోడల్ లో వర్క్ చేయించుకునేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాయని హైసియా సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని కంపెనీలు రోటేషన్ సిస్టమ్ లో ఎంప్లాయీస్ తో వర్క్ చేయించాలని చూస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దశలవారీగా ఆఫీసులు తెరుచుకుని దాదాపు 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసుల నుంచి వర్క్ చేసే చాన్స్ ఉందన్నారు.

బ్యాక్ టు ఆఫీస్ సర్వే

తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) తరఫున బ్యాక్ టు ఆఫీస్ సర్వే చేశాం. దాదాపు 100 కంపెనీలు ఈ సర్వే లో పాల్గొన్నాయి. ఇందులో 98శాతం కంపెనీలు హైబ్రిడ్ మోడల్ వర్క్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపాయి. వారంలో 3 రోజులు ఆఫీసులకు వచ్చే ఎంప్లాయీస్​సైతం పూర్తిగా వ్యాక్సినేటెడ్ అయితేనే రావాలని కంపెనీలు చెప్తున్నాయి. - సత్యనారాయణ మథాలా, అధ్యక్షుడు, టీఎఫ్​ఎంసీ

Tagged survey, Corporate employees, three days office, two days work from home

Latest Videos

Subscribe Now

More News